Leading News Portal in Telugu

World Cup 2023 Points Table: టాప్‌లో దక్షిణాఫ్రికా.. 9వ స్థానంలో ఆస్ట్రేలియా! భారత్ ప్లేస్ ఎక్కడంటే?


World Cup 2023 Points Table: టాప్‌లో దక్షిణాఫ్రికా.. 9వ స్థానంలో ఆస్ట్రేలియా! భారత్ ప్లేస్ ఎక్కడంటే?

Latest ICC World Cup 2023 Points Table: ఐసీసీ పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికాకు ఇది రెండో విజయం. రెండు భారీ విజయాలు అందుకున్న ప్రొటీస్ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. దక్షిణాఫ్రికా రన్‌రేట్ (+2.360) కూడా మెరుగ్గా ఉంది.

అక్టోబరు 8న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌తో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోయింది. ప్రపంచకప్ 2023లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆసీస్.. రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రన్‌రేట్ (-1.846) నెగటివ్‌లో ఉంది. పసికూనలు అఫ్గాన్, నెదర్లాండ్స్ సరసన ఆసీస్ ఉండడం విశేషం. టోర్నీలో ఆస్ట్రేలియా ముందడుగు వేయాలంటే.. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 గెలవాలి. అంతేకాదు మెరుగైన రన్‌రేట్‌ కూడా చాలా అవసరం.

ప్రపంచకప్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడిన న్యూజీలాండ్ రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. నేడు బంగ్లాదేశ్‌పై గెలిస్తే.. కివీస్ టాప్‌కు దూసుకెళుతుంది. సొంతగడ్డపై బరిలోకి దిగిన భారత్ రెండింటిలో గెలిచి మూడో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లలో గెలిచిన పాకిస్తాన్ పట్టికలో నాలుగో స్థంలో ఉంది. ఈ నాలుగు జట్లకు నాలుగేసి పాయింట్స్ ఉన్నా.. రన్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది.

ప్రపంచకప్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్, బాంగ్లాదేశ్ జట్లు ఒక్కో విజయంతో 2 పాయింట్స్ ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో వరుసగా 5, 6 స్థానాల్లో ఉన్నాయి. రెండు మ్యాచ్‌లలో ఓడిన శ్రీలంక, నెదర్లాండ్స్ టీమ్స్ వరుసగా 7, 8వ స్థానంలో ఉన్నాయి. 9వ స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. రెండు మ్యాచ్‌లలో ఓడిన అఫ్గాన్ అట్టడుగున ఉంది. పాయింట్ల పట్టికలో చివరి ఐదు స్థానాల్లో ఉన్న జట్లకు రన్‌రేట్ నెగటివ్‌లో ఉంది.