Leading News Portal in Telugu

Telangana Assembly Elections: బెంగుళూరులో రూ.42 కోట్లు సీజ్.. తెలంగాణకు తరలిస్తుండగా పట్టివేత


Telangana Assembly Elections: బెంగుళూరులో రూ.42 కోట్లు సీజ్.. తెలంగాణకు తరలిస్తుండగా పట్టివేత

Telangana Assembly Elections: కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున రూ. 42 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును తెలంగాణకు తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణకు రూ.8 కోట్లు తరలిపోయినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందిన డబ్బుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసును ఐటీ నుంచి ఈడీకి బదిలీ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సందర్భంగా కర్ణాటక నుంచి తెలంగాణకు నగదు తరలిస్తున్నారనే సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 22 బాక్సుల్లో నగదును పెట్టి లారీలో తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9న విడుదలైంది. ఈ టర్మ్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ గట్టిగా ఉన్నాయి. ఈ సారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా పోలీసుల తనిఖీల్లో రూ. 37 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 30 కిలోల బంగారం, 350 కిలోల వెండిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలతో కొంతమంది అధికారులను ఈసీ తొలగించగా, ఆ స్థానంలో కొందరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు మద్యం, నగదు తరలింపునకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది.