Leading News Portal in Telugu

చంద్రబాబును ఏం చేయాలనుకుంటున్నారు.. కుటుంబ సభ్యుల ఆందోళన! | family members worry about babu health| weight| loss| health| bulletin| pattabhi| hospital| shift| legal


posted on Oct 13, 2023 5:29PM

*నెల రోజుల్లో ఐదు కిలోల బరువు తగ్గారు

*ఇదే పరిస్థితి కిడ్నీలపై ప్రభావం చూపే ప్రమాదం

*భువనేశ్వరి ఆందోళన

* చంద్రబాబును ఆస్పత్రికి తరలించాలి

* న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

* ప్రతి రోజూ అన్ని వివరాలతో బాబు హెల్త్ బులిటిన్ విడుదల చేయాలి

* తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్


తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ముందు డీహైడ్రేషన్, తర్వాత స్కిన్ అలర్జీతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో  వైద్యులు గురువారం జైలుకు  చంద్రబాబును గురువారం పరీక్షించారు.    అక్కడే ఆయనకు కేటాయించిన బ్యారక్ లోనే చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన అవసరం లేదనీ వెల్లడించారు.  అయితే చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందించే చికిత్సపై కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీ బాధపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆయనకు హాని తలపెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులలోనూ తెలుగుదేశం శ్రేణులలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.  జైలులో ఉక్కపోత, అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని ఆరోపించిన లోకేష్.. దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. జైల్లో పరిస్థితులు, ఆయన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, చంద్రబాబుకు చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేసిన లోకేష్.. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లోకేష్  ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇక, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన భార్య భువనేశ్వరి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వ విఫలం అయ్యిందని ఆరోపించారు.   జైలులో తన భర్తకు సకాలంలో వైద్యం అందించలేదని.. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆరోపించారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారన్నారు.  జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని.. జైలులో పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయన్నారు.  

మామ చంద్రబాబు ఆరోగ్యంపై బ్రాహ్మణి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. ఏ విధంగాను అనుకూలంగా లేని, అపరిశుభ్రమైన జైలు వాతావరణంలో ఆయనను నిర్బంధించారని పేర్కొన్నారు.   ఆయన ఆరోగ్యం  ప్రమాదంలో ఉందని  వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న కారణంగా చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని పేర్కొన్నారు. జైల్లో సకాలంలో చంద్రబాబుకు వైద్యం అందడం లేదని, తాము ఆయన ఆరోగ్యం గురించి  తీవ్ర ఆందోళనలో ఉన్నామని ట్విట్టర్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. అత్యవసరంగా అయనకు మెరుగైన చికిత్స అందించాలని బ్రాహ్మణి కోరారు.

ఇక, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అయితే ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టారనీ.. హెల్త్ బులిటెన్‌లో ముఖ్యమైన టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్టులు లేవని ఆయన అంటున్నారు. బ్లడ్ టెస్ట్ వివరాలు లేవని అంటున్నారు. చంద్రబాబు ఐదు కిలోలు బరువు తగ్గారని మాకు సమాచారం ఉంది. ఆయనకు ఏదైనా అయితే సీఎం జగనే బాధ్యత వహించాలని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాతావరణ మార్పుల రీత్యా, చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మాత్రం అందుకు రూల్స్ లేవంటున్నారు. ప్రస్తుతానికి స్కిల్ స్కాం వ్యవహారంలో ఆయనపై అసలు కేసు ఉంచాలా లేదా అన్నది న్యాయస్థానాలకే స్పష్టత లేకపోగా.. ఆయనను మాత్రం జైల్లో పెట్టి వేధిస్తున్నారన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

ఇలా ఉండగా చంద్రబాబును తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కానీ, అన్ని వైద్య సౌకర్యాలూ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తరలించాలని తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు. శుక్రవారం (అక్టోబర్ 13) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో తాము న్యాయస్థాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం, జైలు అధికారులు వాస్తవ సమాచారాన్ని అందించడం లేదని ఆరోపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ లో ఎలాంటి వివరాలూ లేవన్నారు. సుగర్, బీపీ కంట్రోల్ లో ఉన్నాయన్న సమాచారం మాత్రమే ఉందన్నారు. ములాఖత్ తరువాత చంద్రబాబు భార్య భువనేశ్వరి తన భర్త 5 కిలోల బరువు తగ్గారని చెప్పారనీ, నెల రోజులలో ఐదు కిలోల బరువు తగ్గడమంటే చాలా సీరియస్ విషయమనీ పట్టాభి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలూ లేని కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నెలరోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 

అదే వేల కోట్ల అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన సమయంలో జగన్ కు చంచల్ గూడ జైల్లో సకల సౌకర్యాలూ కల్పించారని పట్టాభి ఈ సందర్భంగా ఆరోపించారు. అప్పట్లో జగన్ కు జైల్లో తన సిబ్బందితో ప్రత్యేక కిచెన్ కు కూడా అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు.  అలాగే జగన్ కు ప్రైవేటు వైద్యులు వైద్యల సౌకర్యం కూడా కల్పించినట్లు గుర్తు చేసిన ఆయన ఏం అప్పుడు జగన్ కు ఆ సౌకర్యాలు అందినప్పుడు ఏ నేరమూ చేయకుండా అక్రమంగా అరెస్టు అయిన చంద్రబాబుకు ఎందుకు సౌకర్యాలు కల్పించరని ప్రశ్నించారు.