Leading News Portal in Telugu

China: చైనాలో ఇజ్రాయిల్ ఎంబసీ ఉద్యోగిపై దాడి..



Israel

China: హమాస్‌పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించడంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ వ్యక్తుల్ని, యూదుల్ని టార్గెట్ చేస్తున్నారు. హమాస్ శనివారం ఇజ్రాయిల్‌పై భీకర దాడి జరిపింది. పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులని చూడకుండా దారుణంగా మారణకాండ కొనసాగించారు. చిన్న పిల్లల తలలు నరికి హత్య చేశారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రతీకారాన్ని ప్రస్తుతం హమాస్ చవిచూస్తోంది. గాజా స్ట్రిప్ లోని ఇజ్రాయిల్ దాడులను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు హమాస్ దాడిలో ఇజ్రాయిల్ వైపు 1200 మందికి పైగా చనిపోగా, గాజాలో ఇజ్రాయిల్ దాడుల వల్ల 1500 మంది వరకు మరణించారు.

Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి

ఇదిలా ఉంటే హమాస్ పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించిన తర్వాత ఈజిప్టులో ఇద్దరు ఇజ్రాయిలీలపై ఓ వ్యక్తి కాల్పులు జరిపి చంపాడు. తాజాగా చైనా రాజధాని బీజింగ్ లోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయంలో ఉద్యోగిపై శుక్రవారం దాడి జరిగినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఈ దాడి రాయబార కార్యాలయం లోపల జరగలేదని స్పష్టం చేసింది. దాడికి గురైన వ్యక్తి చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది. దాడికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే హమాస్ పై ఇజ్రాయిల్ దాడులు జరపడమే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజా ప్రాంతంలో భవనాలు నేలమట్టం అవుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం వచ్చినా కూడా ఆ చోటుపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయిల్ వైమానికదళం. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలకు ఇజ్రాయిల్ విదేశీ మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘ఇజ్రాయిలీలు, యూదులపై దాడి’ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులకు హమాస్ తీవ్రవాదులు ‘ఆవేశదినం’ నిర్వహించాలని పిలుపునిచ్చింది.