
Pakistan: పఠాన్ కోట్ దాడి మాస్టర్ మైండ్, జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల పాకిస్తాన్ లోని సియాల్కోట్ లో కాల్చి చంపారు. అయితే ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్ సన్నిహితుడిగా పేరున్న షాహీద్ లతీఫ్ ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో కాల్చి చంపారు.
ఈ ఘటన వెనక చాలా మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు చీఫ్ శుక్రవారం వెల్లడించారు. పంజాబ్ రాజధాని లాహోర్కి 100 కిలోమీటర్ దూరంలో ఉన్న దస్కా నగరంలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటనలో లతీఫ్ తో పాటు అతని సెక్యూరిటీ గార్డు హషీమ్ అలీ కూడా మరణించాడు.
దేశం పేరు చెప్పకుండా, ఈ దాడిలో ఓ రోగ్ నేషన్, దాని గూఢాచర సంస్థ ప్రమేయం ఉందని పంజాబ్ ఐజీపీ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ అన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు షూటర్లను అరెస్ట్ చేశామని, పంజాబ్ లోని సియాల్ కోట్, లాహోర్, పాక్ పట్టాన్, కసూర్, ఇతర జిల్లాల్లో అరెస్టులు జరిగాయని ఆయన చెప్పారు. ఈ దాడి పాకిస్తాన్ వెలుపల ప్లాన్ చేయబడిందని, ఇక్కడి వచ్చిన వ్యక్తి ఎవరు..? ఎవరిని కలుసుకున్నాడు..? అతను ఎక్కడి నుంచి వచ్చాడు..? అనే వివరాలు మా దగ్గర ఉన్నాయని చెప్పాడు. అక్టోబర్ 6-9 మధ్య పాకిస్తాన్ వచ్చాడని, అక్టోబర్ 11న ప్రణాళిక అమలు చేశాడని పోలీస్ అధికారి వెల్లడించాడు. ఇది టార్గెటెడ్ కిల్లింగ్ అని పోలీసులు అభిప్రాయపడ్డారు.
దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన వారు, నేరస్తులు, కార్యనిర్వహకులు ఇలా అందర్ని గుర్తించడానికి పాక్ భద్రతా సంస్థలు సంయుక్తంగా పనిచేశాయని, ఎక్కువ మందిని అరెస్ట్ చేశామని, త్వరలోనే సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరపరుస్తామని చెప్పారు. ఉగ్రవాద ఆరోపణలపై 1994లో భారత్ లో అరెస్టైన లతీఫ్ జైలు శిక్ష అనుభవించి, 2010లో భారత్ నుంచి బహిష్కరించబడ్డాడు. 2016లో పంజాబ్ పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతనే ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. పీఓకేకి చెందిన ఇతను దస్కాలోని నూరీ ఏ మదీనా మసీదులో నిర్వహకుడిగా పనిచేస్తున్నాడు.