posted on Oct 14, 2023 11:00AM
వివాదాలలో ముందుండే ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన శాఖ వద్దకు వచ్చే సరికి తడబడతారు. మాట దాటేస్తారు. ఇంకా కావాలంటే మీడియా సమావేశాల్లో విలేకరులపై విరుచుకుపడతారు. మీ ప్రశ్నలకు జవాబివ్వాల్సిన అవసరం లేదు.. ఏం రాసుకుంటారో రాసుకోండి అని నిప్పులు చెరుగుతారు.
ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు పడింది. మరో ఆరేడు నెలలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టు, ఆయన ఆరోగ్యంపై విపక్షాల ఆందోళన, అధికార పక్షం విషం చిమ్మేలా చేస్తున్న వ్యాఖ్యలు వెరసి వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకతను ప్రోది చేసి పెట్టాయి.
సరిగ్గా ఈ సమయంలో తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ సర్కార్ రైతులను నట్టేట ముంచేసేందుకు రెడీ అయిపోయిందని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయానా ఆ శాఖ మంత్రి అంటే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు.
నాగార్జున సాగర్ ఆయకట్టు కింద భూములకు ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. ఆయకట్టు రైతులెవరూ సాగునీటిపై ఆశలు పెంచుకోవద్దని కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన అంబటిని సాగర్ ఆయకట్టు రైతులు కలిసి సాగునీటి కోసం విజ్ణప్తి చేశారు. అయితే అందుకు అంబటి ఆశించిన మేర నీటి నిల్వలు లేని కారణంగా ఈ ఏడాది నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రైతులను సాగునీటి విడుదల సమస్యే లేదనీ, ఏవైనా ఆశలు ఉంటే వాటిని వదిలేసుకోవాలని రైతులకు చెప్పారు.
అంతే కాకుండా నీరు అనేది సృష్టించేది కాదనీ, బజార్లో దొరికితే కొనుక్కొచ్చి ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదనీ అన్నారు. ఎలాంటి ప్రణాళికలూ లేకుండా..శాఖపై దృష్టి పెట్టకుండా నిత్యం అడ్డగోలుగా విపక్షాల మీద విరుచుకుపడటమే మంత్రిగా తన బాధ్యత అని వ్యవహరించిన అంబటి రాంబాబు.. వర్షాభావ పరిస్థితులపై ముందు నుంచీ అంచనాలు ఉన్నప్పటికీ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలూ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితమే సాగర్ ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు.