Leading News Portal in Telugu

Israel-Hamas War: బందీలుగా తీసుకున్న చంటి పిల్లలను ఆడిస్తున్న హమాస్ ఉగ్రవాదులు.. వీడియో వైరల్..


Israel-Hamas War: బందీలుగా తీసుకున్న చంటి పిల్లలను ఆడిస్తున్న హమాస్ ఉగ్రవాదులు.. వీడియో వైరల్..

Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదుల చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రజల్ని ఊచకోత కోశారు. పసిపిల్లల తలలు నరికేశారు. తల్లిగర్భంలో ఉన్న శిశువులను కూడా వదలకుండా గర్బాన్ని కోసి శిశువును హత్య చేశారు. ఈ దురాగతాలపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అరాచక హత్యల నేపథ్యంలో అరబ్ ప్రపంచ, ఇస్లామిక్ దేశాలు కూడా హమాస్ కి మద్దతు ఇచ్చేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. ఈ హత్యలను ఇజ్రాయిల్ ప్రపంచదేశాల ముందు ఉంచింది. ఇలాంటి దారుణాలు చూస్తానని అనుకోలేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యానించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పిల్లల హత్యలపై వ్యతిరేకత మొదలైంది.

ఇదిలా ఉంటే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ నుంచి బందీలుగా పట్టుకున్న చిన్న పిల్లల్ని ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాయుధులైన ఉగ్రవాదులు ఓ చేతిలో గన్స్, మరో చేతిలో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్నారు. ఈ వీడియోను టెలిగ్రామ్ ఛానెల్ లో ప్రసారం చేశారు.

ఇజ్రాయిల్ నుంచి 150 మందిని బందీలుగా పట్టుకున్నారు హమాస్ ఉగ్రవాదులు. వీరిలో చంటి పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారిని మంచిగా చూసుకుంటున్నామనే సందేశం ఇవ్వడానికే ఈ వీడియోలను హమాస్ ఉగ్రవాదులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఉగ్రవాదులు పిల్లవాడికి ఒక కప్పు నీటిని అందిస్తూ ‘బిస్మిల్లా’ చెప్పమని కోరుతాడు, అందుకు పిల్లవాడు అలాగే చెప్పతాడు. మరో పిల్లాడు టేబుల్‌పై కూర్చుని ఏడుస్తుండటంతో, హమాస్ వ్యక్తి గాయమైన ప్రాంతానికి కట్టుకట్టడం కనిపిస్తుంది.

హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడి చేస్తోంది. ఇప్పటికే గాజాను దిగ్భంధించిన ఇజ్రాయిల్.. ఆ ప్రాంతానికి కరెంట్ , తాగు నీరు, ఇంధనాన్ని కట్ చేసింది. ఉత్తర గాజాలోని ప్రజల్ని 24 గంటల్లో దక్షిణం వైపు వెళ్లాల్సిందిగా హెచ్చరించింది. దీంతో ఉత్తరం నుంచి దక్షిణం వైపు భారీగా ప్రజలు వలసవెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 1300 మంది ఇజ్రాయిలు చనిపోగా.. గాజాలో కూడా వేలల్లో మరణాలు సంభవించాయి. మొత్తంగా 3200 పైగా ప్రజలు మరణించారు.