రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చంద్రబాబు తరలింపు? | babu may be shifted to rajahmundry| government| vip| room
posted on Oct 14, 2023 5:04PM
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రబాబును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే యత్రాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు అలర్జీతో బాధపడుతున్న సంగతి విదితమే. ఆయనను ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. అయితే ఆయనకు నిర్వహించిన పరీక్షలు, ఇచ్చిన మందులపై అనుమానాలు వ్యక్తం కావడం, ఆయన వాస్తవ ఆరోగ్య పరిస్థితిని గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఆయనను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జైలులో చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అనంతరం విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. డయాబెటిక్ పేషెంట్ అయినా చంద్రబాబు సుగర్ లెవెల్స్ పరీక్షించకపోవడం, అలాగే ఆయనకు అందించిన చికిత్స, ఇచ్చిన మందులపై వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి సమగ్ర నివేదికను సీల్డ్ కవర్ లో జైలు అధికారులకు సమర్పించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఇలా ఉండగా ఇప్పటికే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో వీఐపీ గదిని అధికారులు అత్యవసరంగా సిద్ధం చేయించారని చెబుతున్నారు. వైద్యుల సూచనలతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సి వస్తే, ముందు జాగ్రత్త చర్యగా వీఐపీ గదిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ గదితో ఎమెర్జెన్సీ డాక్టర్, ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులను బాబు చికిత్స కోసం కేటాయించారని తెలుస్తోంది.
విఐపీ గదిలో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. అయితే, ప్రభుత్వాసుపత్రిలో ఈ వీఐపీ గదిని ఆగమేఘాలపై సిద్ధం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చంద్రబాబు ఉన్న ఓపెన్ ఎయిర్ జైల్ ప్రాంగణంలోకి ఓ డ్రోన్ వచ్చినట్లు గుర్తించామని జైలు అధికారులే తెలిపారు. అయితే, దీనిపై విచారణ జరిపినా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. దీంతో అసలు జైల్లో ఏం జరుగుతుంది? చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానిపై అనుమానాలు ముప్పిరిగొన్నాయి.