
Revanth Reddy: తెలంగాణ ప్రజలు మరో రెండు నెలలు ఓపిక పట్టండి.. డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. నిర్దిష్టమైన ఆలోచనలతో, ప్రణాళిక బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ గద్దె దిగడమే అన్ని సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని.. ఆరు హామీలతో పాటు, ఇది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మరో హామీ అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 18 నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యటన వివరాలు రేపు మధ్యాహ్నం వరకు అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అందులో 58 పేర్లను మాత్రమే ప్రకటించనున్నారు. నిన్న దాదాపు సగం మంది అభ్యర్ధులపై ఆమోదం లభించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన అభ్యర్దుల పేర్లను త్వరలోనే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.