
Chandrababu: చంద్రబాబు లాయర్ల హౌస్ మోషన్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. రాజమండ్రి జైలులోని స్నేహా బ్లాక్లో చంద్రబాబు ఉంటున్న ప్రత్యేక గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ వైద్యుల సూచనలు జైలు అధికారులు పాటించేలా ఆదేశించాలంటూ చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించిన కోర్టు చంద్రబాబు ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి క్షీణించకుండా వైద్యులు చేసిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలని ఏసీబీ కోర్టు పేర్కొంది.
విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు జడ్జి వైద్యులతో జైళ్ల శాఖ అధికారులతో మాట్లాడారు. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉందని వైద్యులు తెలపగా.. అది కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా? అని న్యాయమూర్తి అడిగారు. స్కిన్ అలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్యసమస్యలు లేవని వైద్యులు జడ్జికి తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ రాత్రికే అధికారులు చంద్రబాబు కోసం ఏసీ ఏర్పాటు చేయనున్నారు.