Leading News Portal in Telugu

Shubman Gill: అహ్మదాబాద్‌లో శుభ్‌మన్‌ గిల్‌.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో..!


Shubman Gill: అహ్మదాబాద్‌లో శుభ్‌మన్‌ గిల్‌.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో..!

Shubman Gill join Indian Team in Ahmedabad: భారత యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ డెంగీ జ్వరం బారిన పడిన విషయం తెలిసిందే. డెంగీ కారణంగా గిల్‌ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా అతడిని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బీసీసీఐ చేర్పించింది. గత ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జి అయ్యాడు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న గిల్‌.. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. గిల్‌ ఇప్పటికే ప్రపంచకప్‌ 2023లో భారత్‌ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న శుభ్‌మన్‌ గిల్‌ బుధవారం అహ్మదాబాద్‌ చేరుకున్నాడు. అహ్మదాబాద్‌ ఎయిర్ పోర్ట్ (సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుంచి బయటకు వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. గిల్ పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. గిల్‌ ఇప్పటికే భారత జట్టుతో కలిసినట్టు తెలుస్తోంది. అయితే అతడు శనివారం దాయాది పాకిస్థాన్‌తో (అక్టోబర్‌ 14) జరిగే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగానే ఉంది.

‘శుభ్‌మన్‌ గిల్‌ గురువారం సాధన చేస్తాడో లేదో ఇంకా తెలియదు. డెంగీ జ్వరం నుంచి అతడు బాగా కోలుకున్నాడు. అయితే శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడతాడో? లేదో? ఇప్పుడే చెప్పలేను’ అని ఓ బీసీసీఐ అధికారి తెలియపాడు. డెంగీ నుంచి కోలుకుంటున్న గిల్‌.. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఆడడని సమాచారం తెలుస్తోంది. గిల్‌ స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ ఫామ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై డకౌట్ అయిన ఇషాన్.. అఫ్గాన్‌పై 47 రన్స్ చేశాడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో కూడా ఇషాన్ ఓపెనింగ్ చేయనున్నాడు.