Leading News Portal in Telugu

Rizwan-Kohli: మహ్మద్‌ రిజ్వాన్ అతి తెలివితేటలు.. ఫ్ట్రస్ట్రేట్ అయిన విరాట్ కోహ్లీ!


Rizwan-Kohli: మహ్మద్‌ రిజ్వాన్ అతి తెలివితేటలు.. ఫ్ట్రస్ట్రేట్ అయిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Mocks Mohammad Rizwan: ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్‌ అజామ్‌ (50; 58 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (86; 63 బంతుల్లో 6×4, 6×6), శ్రేయస్‌ అయ్యర్‌ (53 నాటౌట్‌; 62 బంతుల్లో 3×4, 2×6) అర్ధ శతకాలు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్ట్రస్ట్రేట్ అయ్యాడు.

పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (39) అవుట్ అవగానే.. మొహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. మైదానంలోకి రాగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టాల్సిన రిజ్వాన్‌.. అతి తెలివితేటలు ప్రదర్శించాడు. బ్యాటింగ్‌కు సిద్ధం అవ్వకుండా.. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో మాట్లాడటం మొదలు పెట్టాడు. అలానే మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా సమయం అయినా రిజ్వాన్ క్రీజులోకి రాకపోవడంతో భారత ఆటగాళ్లకు చిరాకేసింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ ఫ్ట్రస్ట్రేట్ అయ్యాడు. చేతికి ఉన్న బ్యాండ్ చూస్తూ.. రిజ్వాన్‌పై సీరియస్ అయ్యాడు. ఏంటీ టైం వేస్ట్? అనేలా సైగలు చేశాడు.

మొహ్మద్ రిజ్వాన్ ఇలా సమయం వృధా చేయడం వలన భారత్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. స్లో ఓవర్ రేట్ కారణముగా 30 యార్డ్స్ సర్కిల్ అవతల ఒక ఫీల్డర్‌ను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే రిజ్వాన్ తన అతి తెలివితేటలు చూపించి.. సమయం వృధా చేశాడు. ఇది అర్థం చేసుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే అంపైర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆపై రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.