
China: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ప్రజలు ఊచకోత కోశారు. ఈ దారుణ ఘటనలో 1300 మంది ఇజ్రాయిలు చంపబడ్డారు. దీంతో పాటు 150 మందిని హమాస్ మిలిటెంట్లు బందీగా గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడి వల్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. వైమానిక దళం గాజా నగరంతో పాటు ఉత్తర ప్రాంతాన్నిటార్గెట్ చేసింది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 2300 మంది పాలస్తీయన్లు చనిపోయారు.
మరోవైపు యుద్ధంలో నిషేధిత వైట్ ఫాస్పరస్ బాంబుల్ని వాడుతోందని పలు దేశాలు ఇజ్రాయిల్ పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఉత్తర గాజాలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని లేకుంటే హమాస్ ఉగ్రవాదులు మిమ్మల్ని మానవకవచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తారని ఇజ్రాయిల్ ఆర్మీ హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ యుద్ధంపై చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆదివారం మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు “ఆత్మ రక్షణ పరిధిని మించి” ఉన్నాయని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం “గాజా ప్రజలపై సామూహిక శిక్షను నిలిపివేయాలి” అని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్-హమాస్ వ్యవహారం పెద్ద యుద్ధంగా విస్తరించకుండా ఉండేందకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా సహకారాన్ని కోరిన ఒక రోజు తర్వాత చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తో మాట్లాడారు. పరిస్థితి తీవ్రతరం చేయడానికి అన్ని పక్షాలు ఎలాంటలి చర్యలు తీసుకోకూడదని, వీలైనంత త్వరగా చర్చలు జరపాలని వాంగ్ యీ సూచించారు. ఈ వివాదాన్ని ముగించడానికి, కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్ వచ్చే వారం మిడిల్ ఈస్ట్ సందర్శించనున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ‘టూ స్టేట్ పాలసీ’ కోసం చర్చలు ప్రాంరభించాలని, ఐక్యరాజ్యసమితి తన పాత్ర పోషించాలని కోరాడు. అయితే హమాస్ దాడిని చైనా ఖండిచకపోవడంపై ఇజ్రాయిల్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది.