
Israel-Hamas War: పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ బలగాలు సిద్ధమవుతున్నాయి. శనివారం పదాతిదళాలను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. రెండో దశకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి ప్రజలు దక్షిణ వైపు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇజ్రాయిల్ గాజా ప్రజలకు మరో 3 గంటల డెడ్‌లైన్ విధించింది. ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతం ‘‘యాక్టివ్ కంబాట్ జోన్’’గా మారుతుందని సీనియర్ ఆర్మీ అధికారులు హెచ్చరించారు.
ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) గాజా స్ట్రిప్ లో వాయు, భూమి, నావికాదళాలతో కూడిన సమన్వయ దాడికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి గాజాలో ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హమాస్ కీలకమైన నుఖ్బా ఫోర్స్ టాప్ కమాండర్ అల్ ఖేద్రా హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడి భయంలో వేల మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతం నుంచి పారిపోతున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించిన మూడు గంటల డెడ్ లైన్ గురించి ఎక్స్ లో ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలాంటి ఆపరేషన్స్ చేయమని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కారిడార్ తెరిచినట్లు చెప్పింది. గాజాలో నివాసితులు, వారి కుటుంబాల భద్రత ముఖ్యమని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది.
హమాస్ ఉగ్రవాదులు ప్రజల్ని మానవ కవచాలుగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఐడీఎఫ్ ఆరోపిస్తోంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లకుండా హమాస్ తీవ్రవాదులు ఆపేసిన ఫోటోలను ఇజ్రాయిల్ విడుదల చేసింది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఘోరమైన దాడి చేసిన సంగతి తెలిసింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. గాజాలో 2300 మంది మరణించారు.