
Iam With CBN Placards Display in India vs Pakistan Match: స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ‘బాబుతో నేను’ అంటూ వేలాది మంది బెంగళూరు ప్రజలు మాజీ సీఎం చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. తాజాగా బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ క్రికెట్ మైదానంలోనూ ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్‌తో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా కొందరు అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విదేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు ప్రజలు, ఐటీ, పారిశ్రామిక వేత్తలు బాబుకు బాసటగా నిలుస్తున్నారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అంటూ అమెరికాలోని ఎడిషన్-న్యూజెర్సీలో తాజాగా నిరసన చేపట్టారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు బాబుకు మద్దతుగా నిలిచారు.