Leading News Portal in Telugu

IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌.. రియల్ గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్‌!


IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌.. రియల్ గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్‌!

Urvashi Rautela Lost 24 Carat Gold iPhone during India vs Pakistan Clash: వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా గత శనివారం (అక్టోబర్‌ 14) అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా కూడా ఇండో-పాక్ మ్యాచ్‌కు వచ్చారు. ఎప్పటిలానే ఊర్వశీ మ్యాచ్ ఆసాంతం భారత జట్టును సపోర్టు చేశారు. స్టేడియంలో అభిమానులతో కలిసి తెగ సందడి చేశారు. అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో ఊర్వశీ తన ఖరీదైన ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా తెలిపారు.

‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల బంగారు ఐ ఫోన్‌ పోయింది. ప్లీజ్ నాకు సహాయం చేయండి. ఎవరికైనా దొరికితే వెంటనే నన్ను సంప్రదించండి’ అని బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సాయం చేయాలని కోరుతూ అహ్మదాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేశారు. ఊర్వశీ పోస్ట్‌కు స్పందించిన పోలీసులు ఫోన్‌ వివరాలు చెప్పాలని రిప్లై ఇచ్చారు. మరోవైపు తన ఐ ఫోన్‌ పోయినట్టు పోలీస్ స్టేషన్‌లోనూ ఊర్వశీ ఫిర్యాదు కూడా చేశారు.

భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊర్వశీ రౌతేలా తన ఐ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఆ ఐ ఫోన్‌ పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఊర్వశీ తెలుగు సినిమాల్లో వరుసగా ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తున్నారు. తాజాగా ‘స్కంద’ సినిమాలో ‘కల్ట్‌ మామా’ అనే పాటకు ప్రేక్షకులను అలరించారు. అంతకుముందు ఏజెంట్, వాల్తేరు వీరయ్య, బ్రో సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ చేశారు.