Leading News Portal in Telugu

World Cup 2023: బలమైన బ్యాటింగ్, హడలెత్తించే బౌలర్లు.. అయినా ప్రపంచకప్‌ 2023లో ఖాతా తెరవలేదు!


World Cup 2023: బలమైన బ్యాటింగ్, హడలెత్తించే బౌలర్లు.. అయినా ప్రపంచకప్‌ 2023లో ఖాతా తెరవలేదు!

World Cup 2023 Australia vs Sri Lanka 14th Match Preview: అయిదుసార్లు ఛాంపియన్‌ ట్యాగ్.. బలమైన బ్యాటింగ్ లైనప్.. స్టార్ బ్యాటర్లను సైతం హడలెత్తించే బౌలర్లు.. నాణ్యమైన ఆల్‌రౌండర్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్‌ 2023లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు అయినా.. పేలవ ఆట తీరుతో ప్రపంచకప్‌ 2023లో ఇంకా బోణీ కొట్టలేదు. పాయింట్ల పట్టికలో పసికూనల కంటే కింద అట్టడుగున ఉంది. ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం ఆశగా చూస్తున్న ఆసీస్.. నేడు శ్రీలంకతో కీలక మ్యాచ్ ఆడనుంది. లంకపై గెలిచి టోర్నీలో ఖాతా తెరవాలనే పట్టుదలతో కమిన్స్ సేన బరిలోకి దిగుతోంది.

ప్రపంచకప్‌ 2023లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్ దారుణ ఓటములను ఎదుర్కొంది. వరుసగా భారత్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఆసీస్‌.. టోర్నీలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. డేవిడ్ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్ స్మిత్‌, మార్నస్ లబుషేన్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మార్కస్ స్టాయినిస్‌ లాంటి బ్యాటర్లున్న ఆసీస్‌.. మెగా టోర్నీలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా 200 పరుగులు చేయలేదు. భారత్‌ స్పిన్‌ దెబ్బకు 199కే ఆలౌటైన ఆసీస్.. సఫారీ పేస్‌ దాటికి 177 పరుగులకే కుప్పకూలింది. ఫీల్డింగ్‌లోనూ రెండు మ్యాచ్‌ల్లో 6 క్యాచ్‌లు వదిలేశారు. జోష్ హేజిల్ వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి మేటి పేస్ బౌలర్ల బౌలింగ్‌లోనూ పదును లేదు. లంకపై గెలవాలంటే మూడు విభాగాల్లోనూ ఆసీస్‌ రాణించాల్సిందే.

ప్రపంచకప్‌ 2023లో ఇక తాము ఆడబోయే ప్రతి మ్యాచ్‌ ఫైనల్‌ లాంటిదే అని ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ అన్నాడు. ‘2019లో తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో పరాజయం పాలయ్యాం. ఈ రెండు జట్లు గతేడాది నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ ప్రపంచకప్‌లో మిగిలిన జట్లతో ఆడబోతున్నాం. వీటిపై మాకు మంచి రికార్డు ఉంది. ప్రతి ఒక్కరూ విజయం కోసం ఆరాటపడుతున్నారు. ఇక ఇప్పుడు గెలుపు బాటలో పయనించాలి. మిగిలిన అన్ని మ్యాచ్‌లూ గెలవాలి. ప్రతి మ్యాచ్‌ ఫైనల్‌ లాంటిదే’ అని కమిన్స్‌ అన్నాడు.

మరోవైపు శ్రీలంక పరిస్థితి కూడా అంతంతగానే ఉంది. ప్రపంచకప్‌ 2023లో లంక కూడా ఇంకా బోణి కొట్టలేదు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ చేతుల్లో ఓడిపోయింది. నేడు ఆస్ట్రేలియాపై గెలవాలని చూస్తోంది. అయితే గాయంతో కెప్టెన్‌ దాసున్ శానక దూరమవడం లంకకు ఎదురు దెబ్బ అని చెప్పాలి. దెబ్బతిని ఉన్న ఆస్ట్రేలియాపై గెలుపు అంత సులువు కాదు. 2011 ప్రపంచకప్‌ అనంతరం సీనియర్లు ఒక్కరుగా వీడ్కోలు పలకడంతో లంక పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికీ అప్పటి మార్క్ ఆట ఆ జట్టులో కనబడడం లేదు.