Leading News Portal in Telugu

Olympics: ఒలింపిక్స్ 2028లో క్రికెట్ ప్రవేశంపై తుది నిర్ణయం.. అధికారిక ప్రకటన వెల్లడి


Olympics: ఒలింపిక్స్ 2028లో క్రికెట్ ప్రవేశంపై తుది నిర్ణయం.. అధికారిక ప్రకటన వెల్లడి

Olympics: 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ప్రవేశించింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌తో పాటు మరో 4 క్రీడలను చేర్చాలని అధికారిక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌తో పాటు, బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్ కూడా నిర్వహించనున్నారు. గత శుక్రవారమే ఒలింపిక్స్‌లో ఈ ఐదు క్రీడాంశాల ప్రవేశానికి సంబంధించి చర్చలు జరిగాయి. వాస్తవానికి.. ఈ ఐదు క్రీడలను ఒలింపిక్స్ 2028లో చేర్చాలనే లాస్ ఏంజిల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజర్ల ప్రతిపాదనపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు గత వారంలోనే చర్చలను ఆమోదించింది. ఈ విషయమై ఆదివారం నుంచి ముంబైలో చివరి రౌండ్ చర్చలు సాగగా.. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఒలింపిక్స్‌లో ఈ క్రీడలను చేర్చేందుకు అధికారిక ప్రకటన వెలువడింది.

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ప్రవేశించబోతుంది. అంతకుముందు 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ను నిర్వహించారు. అంటే 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లో క్రికెట్‌కి ప్రవేశం లభించింది. ఇందుకోసం ఐసీసీ తీవ్రంగా శ్రమించింది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ జరుగనుంది. ఇందులో పురుషులు, మహిళల ఈవెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం 6-6 జట్లకు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని ప్రతిపాదించారు. రానున్న రోజుల్లో టీమ్‌ల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.