Leading News Portal in Telugu

Rajnath Singh: కారు బేకారు అయింది.. కాంగ్రెస్ చెయ్యి ప్రజల్ని ఎప్పుడో వదిలేసింది..


Rajnath Singh: కారు బేకారు అయింది.. కాంగ్రెస్ చెయ్యి ప్రజల్ని ఎప్పుడో వదిలేసింది..

Union Minister Rajnath Singh: సభలకు హాజరవుతున్న ప్రజలను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. మహేశ్వరంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిలు పాల్గొన్నారు. తెలంగాణ పరాక్రమ భూమి అని.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీది ప్రముఖ పాత్ర అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అభివృద్ది వేగంగా జరుగుతుందని బీజేపీ భావించిందన్నారు. తెలంగాణను కేసీఆర్, బీఆర్‌ఎస్‌ తీసుకు రాలేదన్న ఆయన.. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తెలంగాణ యువతది, తెలంగాణ ప్రజలది అని అన్నారు.

బీజేపీకి, తెలంగాణకు ఓల్డ్ సంబంధం ఉందని.. పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో బీజేపీ గెలిచిన సీట్లలో తెలంగాణ నుంచి ఒకటి ఉందని.. ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఈ రోజు బీజేపీ 302 సీట్లకు చేరుకుందని ఆయన వెల్లడించారు. అభివృద్ది విషయంలో గుజరాత్‌ను చూడాలని.. అక్కడ 27 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో కొనసాగుతుందన్నారు. 10 ఏళ్లుగా కేసీఆర్ అధికారంలో ఉన్నారని.. హైదరాబాద్ మినహా తెలంగాణ అభివృద్ది చెందలేదన్నారు. ఇంకా వెనుక బడిన రాష్ట్రంగానే ఉంచారని రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అంటోందని.. తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని, ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు. సుష్మ స్వరాజ్ ఒత్తిడితోనే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు కోసం దిగి వచ్చిందన్నారు. చాలా సమస్యలను పరిష్కరించకుండా తెలంగాణను కాంగ్రెస్ దగా చేసిందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో అభివృద్ధిని ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చారని కేంద్ర మంత్రి ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ పాలనలో కుటుంబ జోక్యం ఉందన్న ఆయన.. ఇక్కడ జరుగుతున్న అవినీతి ఢిల్లీ వరకు వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమనే ప్రభుత్వం కావాలి కానీ కుటుంబం ఫస్ట్ అనే ప్రభుత్వం కాదన్నారు. కుటుంబాలకు వ్యతిరేకం కాదు.. కానీ మొత్తం కుటుంబం రాజకీయం చేయడం ప్రభుత్వంలో ఉండడానికి వ్యతిరేకమన్నారు.

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “అవినీతిని మాటలతో అంతం చేయలేము.. వ్యవస్థలో మార్పు ద్వారా చేయగలుగుతాము. మోడీ ఆ పని చేసి చూపించాడు… అవినీతి ఆరోపణలు మోడీ సర్కార్‌పై లేవు. మోడీకి తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం. వేలాది కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి. మా దగ్గర అభివృద్ధి కోసం విజన్ ఉంది.. మిషన్ ఉంది.. ఫ్యాషన్ ఉంది. బీఆర్‌ఎస్‌తో ఎంఐఎం కలిసి ఉంది.కుల, మత, వర్గ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. మానవత్వం, న్యాయ పరమైన రాజకీయాలు బీజేపీ కోరుకుంటుంది. ఉగ్రవాదాన్ని సమర్థించడం సమంజసం కాదు.. ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. బీఆర్‌ఎస్‌ కారు బేకారు.. కాంగ్రెస్ చెయ్యి ప్రజల్ని ఎప్పుడో వదిలేసింది. వికసించేది కమలం.. కమలం గుర్తుపైన ఓటు వేయండి. కారు మీద నో, చెయ్యి పట్టుకొని లక్ష్మీ దేవి మన ఇంటికి రాదు.. కమలం పువ్వు మీదనే ఇంటికి వస్తుంది.” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.