
Indrakeeladri Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు ఇప్పటివరకూ అమ్మవారిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. మొదటి రోజు కంటే భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజున టిక్కెట్లు, కేశఖండన, ఆర్జిత సేవల ద్వారా 41 లక్షల ఆదాయం వచ్చిందని దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ్టితో పోలిస్తే 20 శాతం భక్తుల రద్దీ మొదటి రోజు ఎక్కువగా ఉందన్నారు. ఇవాళ ఆర్జిత సేవ, దర్శన టిక్కెట్లు, కేశఖండన ద్వారా సాయంత్రం వరకు 21లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీఐపీలు సమయపాలన పాటించాలని కోరారు.