
AUS vs SL: వరల్డ్ కప్ 2023లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన ఖాతాను తెరిచింది. ఈరోజు లక్నోలో జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు శ్రీలంక జట్టు ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ లో మూడు ఓడిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. మిడిలార్డర్లు వచ్చి ఆదుకోవడంతో విజయపతాన్ని ఎగురవేసింది. నాలుగో ఓవర్లోని తొలి బంతికే డేవిడ్ వార్నర్ (11) రూపంలో జట్టుకు తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి స్టీవ్ స్మిత్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మార్నస్ లాబుస్చాగ్నే, ఇంగ్లిస్, మ్యాక్స్ వెల్ జట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా జట్టులో బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, బౌలర్ ఆడమ్ జంపా జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. ఇంగ్లిష్ 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 పరుగులు చేయగా, మార్ష్ 9 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక తరఫున ఓపెనర్ కుశాల్ పెరీరా 12 ఫోర్లతో 78 (82 బంతుల్లో), పాతుమ్ నిస్సాంక 8 ఫోర్ల సాయంతో 61 (67 బంతుల్లో) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక శ్రీలంక బౌలింగ్ లో దిల్షాన్ మధుశంక అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. దునిత్ వెల్లలేగ ఒక వికెట్ తీశాడు.