Leading News Portal in Telugu

Shoaib Malik: బాబర్ రాజీనామా చేస్తే.. నెక్స్ట్ కెప్టెనే అతడే..!


Shoaib Malik: బాబర్ రాజీనామా చేస్తే.. నెక్స్ట్ కెప్టెనే అతడే..!

Shoaib Malik: ఈసారైనా భారత్ ను ఓడించాలన్న ధృడ నిశ్చయంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. గత శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇది వరుసగా ఎనిమిదో ఓటమి. ఈ ఓటమి తర్వాత బాబర్ ఆజామ్‌ను పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చర్చలు జోరందుకున్నాయి. బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేస్తే షాహీన్ వైట్ బాల్ కెప్టెన్‌గా మారాలని జట్టు అనుభవజ్ఞుడైన ఆటగాడు షోయబ్ మాలిక్ అన్నాడు.

పాకిస్థాన్ కెప్టెన్సీ గురించి షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. “బాబర్ ఆజం రాజీనామా చేస్తే వైట్ బాల్ క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదీని కెప్టెన్‌గా చేయాలన్నాడు. అతను లాహోర్ ఖలందర్స్‌కు అటాకింగ్ కెప్టెన్ అని చూపించాడని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ లో షాహీన్ అఫ్రిది తన కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్‌ను ఛాంపియన్‌గా చేశాడు. అంతకుముందు 2022లో కూడా షాహీన్ అఫ్రిది కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

బాబర్ ఆజం మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2019 నుండి ఇప్పటి వరకు బాబర్ మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, ODI, T20 ఇంటర్నేషనల్) 128 మ్యాచ్‌లకు పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 1992 నుంచి 2023 వరకు జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌పై జట్టును విజయపథంలో నడిపిస్తారని బాబర్ సేన నుంచి ఆశించినప్పటికీ అది కుదరలేదు. వన్డే ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో 2 విజయాలు సాధించింది. పాకిస్తాన్ జట్టు భారత్‌పై మాత్రమే ఓటమిని చవిచూసింది. అంతకుముందు నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించింది.