Leading News Portal in Telugu

పొమ్మని పొగపెడుతున్నా పోలేక.. వైసీపీలో బాలినేని విలవిల! | suffocation to balineni| ysp| insult| ignore| helpless| relative


posted on Oct 17, 2023 1:37PM

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అన్నిటికీ  మించి ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర బంధువు అయిన బాలినేని పరిస్థితి పార్టీలో ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. ఇటువంటి పరిస్థతి పగవాడికి కూడా వద్దురా నాయనా అన్నట్లుగా తయారైంది. పార్టీలో ఆయనకు పొమ్మన లేక పోగపెడుతున్న పరిస్థితులు ఉన్నా.. ఆ పొగకు ఉక్కిరి బిక్కిర అవ్వడం తప్ప పార్టీ నుంచి బయటకు రాలేక, పార్టీలో ఇమడ  లేక ఆయన నరక యాతన అనుభవిస్తున్నారు. తన  అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం  చేసిన ప్రతి సారీ ఆయనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వస్తున్నది. బుజ్జగింపు మాటలతో సముదాయించి పంపేస్తున్నారు. పరిస్థితి మళ్లీ  షరా మామూలే. టార్గెట్ చేసినట్లుగా పార్టీలో ఆయన , ఆయన క్యాడర్  అనుక్షణం వేధిపులకు గురి అవుతున్నారు. 

ఔను నిజమే ఇప్పుడు ఆయన గురించి అందరూ ఒకే మాట అంటున్నారు. పాపం బాలినేని.. పేరుకేమో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆప్తుడు, దగ్గర బంధువు.  కానీ పార్టీలోనేమో  కూరలో కరివేపాకు. పోనీ బయటకి వెళ్లిపోదామంటే ఎప్పటికప్పుడు బుజ్జగింపులు. ఎలాగోలా ఉందామంటే మనస్సాక్షిని చంపుకొని, ఆత్మగౌరవాన్ని వదలుకుని ఉండలేని పరిస్థితి. మొత్తంగా బాలినేని పరిస్థితి పగవాడికి కూడా  రాకూడదురా భగవంతుడా అన్నట్లుగా తయారైంది.  పార్టీలో తగిన గౌరవం లేకపోవడం.. బాధను వెళ్లగక్కుతూ అల్టిమేటం జారీచేయడం.. ఇంతలోనే తాడేపల్లి నుండి పిలుపు రావడంతో బుజ్జగింపులకు పడిపోయి మళ్ళీ పార్టీలో కలిసి పోవడం మంత్రి పదవిని జగన్ ఊడబీకేసినప్పటి నుంచీ బాలినేనికి పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని   కీలక నేత. అందులో సందేహం లేదు. నాడు వైఎస్సార్.. నేడు జగన్ హయాంలోనూ ఓ వెలుగు వెలిగారు. అయితే, ఇదంతా వైసీపీ అధికారంలోకి రాకముందు మాట. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక  జగన్ తొలి కేబినెట్ లో స్థానం దక్కినా, మలి క్యాబినెట్ లో పదవి పోయిన తరువాత వైసీపీలో బాలినేనికి ప్రాధాన్యత సంగతి అటుంచి కనీస గౌరవం కూడా లేకుండాపోయింది. పార్టీలో పరిస్థితి అలా ఉంటే.. కనీసం ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదు.   ఆఖరికి పోలీసులు, ఎమ్మార్వోలు, ముఖ్య అధికారుల బదిలీల విషయంలో  ఆయనకు కనీస సమాచారం ఉండటం లేదు.

ఇటీవల బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డైరెక్ట్ గా జగన్ ను కలుస్తానని హెచ్చరిక లాంటి ప్రకటన చేశారు.  అయితే ఆయన  అల్టిమేటమ్ ను పట్టించుకున్న  నాథుడే లేరు.  

ఇక తాజాగా మరోసారి బాలినేని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతూ.. తన సెక్యూరిటీని సైతం సరెండర్ చేశారు.  ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల స్కాం లో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కాంలో అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, తన రాజకీయ జీవితంలో  ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఆయనో సంచలన వ్యాఖ్య చేశారు. కేవలం నాలుగేళ్ల నుంచే  ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అన్నారు. అంటే పరోక్షంగా జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ, అంటే వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యవస్థంగా మారాయని ఆయన పరోక్షంగా చెప్పారు.

సరే ఇక విషయానికి వస్తే పోలీసుల తీరుకు నిరసనగా  తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ నకిలీ దస్తావేజుల స్కాంలో   ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అనుచరులు ఉన్నారని బాలిరెడ్డి ఆరోపణ. అయితే పోలీసులు మాత్రం బాలినేని అనుచరులను వదిలేసి ఓ పది మందిని అరెస్టు చేశారు. దీనిపైనే బాలిరెడ్డి ఫైర్ అయ్యారని అంటున్నారు. సూత్రధారులను, అసలు నిందితులను వదిలేసి కేసును నిర్వీర్యం చేయడానికి పోలీసలు ప్రయత్నిస్తున్నారంటూ బాలినేని డీజీపీకి లేఖ రాసి మరీ తన గన్ మెన్లను సరెండర్ చేశారు. అయితే ఆయన ఈ చర్యను సర్కార్ కానీ, పోలీసులు కానీ సిరియస్ గా తీసుకునే పరిస్థితులైతే లేవని అంటున్నారు.