
తెలంగాణలో ఎన్నికల వేళ పలు పార్టీల నుంచి నేతల మరోపార్టీల తీర్థం పుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీలో చేరారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ నాయకులు రంజిత్ యాదవ్, పాశం గోపాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. అంతేకాకుండా.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, యడవల్లి చంద్రశేఖర్ రెడ్డి. కోదాడ నుండి ఓరుగంటి కిట్టు పలువురు తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల నగారా మోగిన తరువాత వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆశావాహులు చాలామంది బీజేపీలో చేరుతున్నారు. మీడియాలో చూపించకపోయినా.. ప్రజాక్షేత్రంలో బీజేపీనే సరైన వేదిక అని భావిస్తున్నారు. బీజేపీకి ఓటు వేయాలని కేసీఆర్ ను ఒడగొట్టాలని ప్రజలు భావిస్తున్నారు.
కేసీఆర్ డబ్బులతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలీసుపహారాలో ఇప్పటికే డబ్బులు పంపించారు. బీజేపీ నాయకులకు వెలకట్టి కొనాలని చూస్తున్నారు. తలకాయ కిందపెట్టి, కాళ్లు పైకి పెట్టినా ఈ సారీ కేసీఆర్ కి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ గురించి తెలంగాణ సమాజానికి తెలుసు, వారి పాలనలో ఏం జరిగిందో అందరూ చూసారు. తొమ్మిదేళ్ళ పాలనలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్‌ఎస్. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదు. హుజూరాబాద్లో ఎన్నికల సమయంలో మా ప్రజలను కేసీఆర్ పెట్టిన ఇబ్బందులు చూసి గజ్వేల్ లో తేల్చుకుంటా అని అప్పుడే చెప్పిన. గజ్వేల్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నాడో మేము ఉన్నామో 2023 నవంబర్ 30 న తేలిపోతుంది. నేను పోకముందే వందలమంది మీటింగ్ పెట్టుకుని నాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
హుజూరాబాద్ ప్రజలకు ఉపఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎలాంటి అవకాశం వచ్చిందో ఇప్పడు గజ్వేల్ ప్రజలకు అలాంటి సదావకాశం వస్తుంది అందిపుచుకోవడానికి వారు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ అహంకారం, దుర్మార్గపు పాలన అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గజ్వేల్లో పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్న దుర్మార్గపు వ్యవస్థ నడుస్తుంది. ఈటల రాజేందర్ కు మద్దతు ఇస్తేతొక్కి పడేస్తా అని హరీష్ అంటున్నారట.. తొక్కి పడేసే శక్తి నీకు లేదు. తొక్కిపడేసేది గజ్వేల్ ప్రజలు. ఓట్లు గుద్దుకొనే అవకాశం ఉంటే నువ్వే గుద్దుకొనేవాడివేమో కానీ ఓట్లు వేసేది నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, నీ కులం కాదు గజ్వేల్ ప్రజలు. అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యాన్మాయం కాదు. అయినా ఆయన మండలం తప్ప ఎక్కడా రోడ్లు వెయ్యలేదు. నవంబర్ 30 న ఆత్మను ఆవిష్కరించండి. ప్రజలారా మీకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఉంటుంది అని ఈటల రాజేందర్ అన్నారు.