Leading News Portal in Telugu

ఉచితాలు వర్షించినా గెలుపు గ్యారంటీ డౌటే! | wii freebees garuntee win| ts| elections| all| parties| promises


posted on Oct 17, 2023 5:51PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలౌంది.  దాదాపు రెండు సంవత్సరాలుగా ముందస్తు, వెనకస్తూ, జమిలి,మినీ జమిలీ అంటూ షికార్లు చేసిన  వ్యూహాగానాలన్నీ గాలికి కొట్టుకు పోయాయి. కేంద్ర ఎన్నికల సంఘం, ముందు వెనకల జోలికి వెళ్ళకుండా  షెడ్యూలు ప్రకారమే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపు ..అంతా లెక్క ప్రకారమే జరుగుతోంది.

అయితే ఇప్పుడు అందరి దృష్టీ పార్టీల గెలుపు ఓటముల మీదకు మళ్లింది.  అఫ్కోర్స్, ఈ లెక్కలు, అంచనాలు, జోస్తాలూ కూడా చాలా కాలం నుంచీ వినిపిస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. అయినా  ప్రస్తుతం కాంగ్రెస్ గెలుస్తుందని కొందరు, కాదు, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందనిఇంకొందరు, కాదు..కాదు.. బీజేపీ కోరుకుంటున్నట్లే హంగ్ వస్తుందని ఇంకొందరు లెక్కలు వేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలతో అందలం ఎక్కిన నేపధ్యలో తెలంగాణలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఇప్పటికే పోటాపోటీగా  ఉచిత  గ్యారెంటీలను అదే హామీలను ప్రకటించేశాయి. ఇక ఇహనో ఇప్పుడో  బీజేపీ కూడా  ఏడు  రంగుల  ఇంద్రధనస్సు పేరిట ఏడు గ్యారెంటీలను ప్రకటిస్తుందని అంటున్నారు. అందులోనూ ఉచితాలే ఉంటాయో లేక మహిల రిజర్వేషన్ వంటి ఎండమావులే ఉంటాయో, ఇంకేమైనా ఉంటాయో  తెలియదు కానీ అన్ని పార్టీలు  గ్యారెంటీ లనే నమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఉచిత వరాలపైనే గెలుపు ఆశలు పెంచుకుంటున్నాయి.

అయితే ప్రజలు గ్యారెంటీలకే ఓట్లేస్తారా? అంటే డౌటే అంటున్నారు విశ్లేషకులు.   కాంగ్రెస్ ముందుగానే ప్రకటించిన గ్యారంటీలకు దీటుగా ఉండేందుకు  నెలరోజులకు పైగా మౌనంగా మేథోమథనం సాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాత పథకాలనే  సొబగులద్ది  మేనిఫెస్టో షో కేసులో పెట్టారు. మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే  నింపారు. అలాగే కాంగ్రెస్ ను మరింత దీటుగా ఎదుర్కునేందుకు ఇప్పటికే ఉన్న పథకాలకు తోడుగా కొత్త పథకాలను కూడా జోడించారు. 

రైతుబీమా తరహాలో, తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా   పథకం అన్నారు. కేసీఆర్‌ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు.ఆసరా పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతామని మరో వాగ్దానం చేశారు. దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు,  సౌభాగ్యలక్ష్మి పథకం’ కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి, అర్హులైనవారికి రూ.400కే గ్యాస్‌ సిలిండర్లు,  జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు, రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు, కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం,జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు…ఇలా ఉచిత వరాలను వడ్డించారు.  అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు తోడు.. మేనిఫెస్టోలో ఇంకెన్ని గ్యారెంటీలను వడ్డిస్తుందో చూడవలసి వుంది. అలాగే  ఉచితాల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులేసే బీజేపీ కూడా ఈసారి తగ్గేదేలే ..అన్నట్లు ఉచితాలను వర్షిస్తుందని అంటున్నారు.అయితే,  ఇచ్చిన గ్యారెంటీలు ఏ పార్టీకి అయినా  గెలుపు గ్యారెంటీ ఇస్తున్నాయా.. అంటే .. డౌటే ..అంటున్నారు.