Leading News Portal in Telugu

Mahua Moitra: టీఎంసీ ఎంపీపై ఆరోపణల వ్యవహారం.. బీజేపీ ఎంపీ, సుప్రీం న్యాయవాదిపై లీగల్‌ నోటీసులు


Mahua Moitra: టీఎంసీ ఎంపీపై ఆరోపణల వ్యవహారం.. బీజేపీ ఎంపీ, సుప్రీం న్యాయవాదిపై లీగల్‌ నోటీసులు

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే, సుప్రీం న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌లకు లీగల్ నోటీసులు పంపారు. మొయిత్రా లోక్‌సభ లాగిన్‌ వివరాలను ఓ వ్యాపారవేత్తకు అందజేశారని సోమవారం ఆరోపించారు. ఈ అంశంపై వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాలని స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కూడా బీజేపీ నేత నిషికాంత్‌ దూబే కోరారు. నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను హీరానందానీ గ్రూప్ ఖండించింది. రాజకీయ వ్యాపారంలో ప్రమేయం లేదని పేర్కొంది.

ఈ ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీల పార్లమెంటరీ పనులను పర్సనల్‌ అసిస్టెంట్లు, ఇంటర్న్‌లతో పాటు పెద్దబృందాలు చూసుకుంటాయని పేర్కొ్‌న్నారు. నిషికాంత్ దూబే, జై అనంత్ దేహద్రాయ్ వ్యక్తిగత, రాజకీయ పగ తీర్చుకోవడానికి తన ప్రతిష్ట, సద్భావనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు టీఎంసీ ఎంపీ డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ స్పందించింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొన్ని గ్రూప్‌లు, కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ మొయిత్రాను ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు గుప్పించింది. మరోవైపు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా నిషికాంత్‌ దుబేతో పాటు జై అనంత్ దేహద్రాయ్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో తనపై వచ్చిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని మహువా మోయిత్రా నిషికాంత్ దూబేని కోరారు. ఆమె దూబే, దేహద్రాయ్‌ల నుండి వ్రాతపూర్వక క్షమాపణ కూడా కోరింది.

మహువా మొయిత్రా లంచం తీసుకుంటూ పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇప్పుడు స్పీకర్ ఈ ఫిర్యాదును లోక్‌సభ నైతిక విలువల కమిటీకి అందజేశారు. మహువా మొయిత్రా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదు, బహుమతుల రూపంలో లంచం తీసుకున్నారని, అందుకు ప్రతిఫలంగా ఆమె పార్లమెంటులో కూడా కొన్ని ప్రశ్నలు అడిగారని దూబే చెప్పారు. మహువా తన లోక్‌సభ లాగిన్ వివరాలను కూడా లీక్ చేశారని నిషికాంత్ దూబే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చెప్పారు. దీనిపై కూడా విచారణ జరపాలన్నారు.