
Pakistan Team: వరల్డ్ కప్ 2023లో భాగంగా.. మొన్న ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిని ఇంకా దిగమింగుకోక ముందే.. ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈనెల 20న బెంగళూరు వేదికగా పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడనుంది. అందుకోసం ఆదివారం బెంగళూరుకు చేరుకున్న పాక్ జట్టు.. ఇప్పటివరకు ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు.
కారణమేంటంటే.. పాకిస్తాన్ జట్టులో కొందరు ఆటగాళ్లు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే వీరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగిటివ్ అని తేలింది. ఇకపోతే.. ఆసీస్ తో మ్యాచ్ కు మరో రెండ్రోజుల మాత్రమే సమయం ఉంది. మరీ ఆ టైం వరకు కోలుకుంటారా లేదా అని తెలియాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ సమయం వరకు కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి.. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ ప్రాక్టీస్ పాల్గొనవలసింది. కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. ఇదిలా ఉంటే పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.