posted on Oct 18, 2023 7:19AM
రానున్న ఎన్నికలలో టీడీపీ విజయం ఖరారైంది. ఇప్పటికే వెలువడిన ముందస్తు సర్వేలు, రాష్ట్ర ప్రజల మూడ్ (మూడ్ ఆఫ్ ఏపీ)ను బట్టి రాజకీయ పరిశీలకులు ప్రభుత్వం మారడం ఖాయమని తేల్చేశారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసు. వైసీపీ సొంత సర్వేలలో ప్రజల అసంతృప్తి స్పష్టంగా వెలువడింది. గడప గడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అసంతృప్తి సెగ కు మాడిపోయారు. ప్రజాగ్రహాన్ని స్వయంగా చవి చూశారు. దానికి తోడు ఇప్పుడు పసలేని అక్రమ కేసులలో అలవి గాని సెక్షన్లను బనాయించి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా వైసీపీ పట్ల ప్రజలలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. నెరవేరని హామీలు, పడకేసిన అభివృద్ధి, ఊసే లేని ఉపాధి, ఏ రంగానికి దక్కని ప్రోత్సాహం, స్పష్టత లేని మంత్రులు, దిశా నిర్ధేశం లేని ప్రభుత్వం, ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా కేవలం బటన్ నొక్కుడు ఒక్కటే పనిగా పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఫలితంగా ఈ అసంతృప్తి రేపు ఎన్నికలలో ప్రతిపక్షాలకు ఓట్లుగా మారనుందన్నది పరిశీలకుల విశ్లేషణ. .
వైసీపీ మీద అసంతృప్తి ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమికి ఓటు బ్యాంకు కానుందా అంటే ఖచ్చితంగా ఔననే సమాధానమే వస్తున్నది. ఏపీలో ఇప్పుడు బలమైన పార్టీలు టీడీపీ, వైసీపీలే కాగా.. మూడవ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ జనసేన కనిపిస్తున్నది. అయితే, పవన్ జనసేన ఇప్పుడు టీడీపీలో ఉంది. మిగతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా రెండూ కలిపినా రెండు శాతం ఓటింగ్ కూడా లేని పార్టీలు. ఇక కమ్యూనిస్టులు కూడా టీడీపీ, జనసేనతో కలిసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న రాష్ట్ర ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమివైపే మొగ్గు చూపుతున్నారు. ప్రజా వ్యతిరేకత, ప్రధాన ప్రత్యామ్నాయంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పిదాలు కూడా టీడీపీ విజయానికి రెడ్ కార్పెట్ పరిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నాలుగేళ్ల జగన్ పాలనలో సామాజిక వర్గాల మధ్య తీవ్ర అగాధం పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మీడియా మైకుల ముందుకొచ్చిన ప్రతి వైసీపీ నాయకుడు చంద్రబాబు సామాజికవర్గాన్ని కలవరించే వారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సొంత సామజిక వర్గానికి దోచి పెట్టారనే కోణంలోనే విమర్శలు సాగేవి. చివరికి రాజధాని కూడా చంద్రబాబు సామాజికవర్గం కోసమే అమరావతిలో పెట్టారనే ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల పాటు ఈ తరహా విమర్శలు సాగగా ఆ తర్వాత వైసీపీ నేతలు ఆ పాఠాలను వదిలేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంశంలో కూడా అదే జరిగింది. వైసీపీలో పవన్ సామాజిక వర్గ నేతలను ఉసిగొల్పి విమర్శలు చేయించారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో వైసీపీ నేతలు రూట్ మార్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు అనే నినాదం అందుకున్నారు. ఫైనల్ గా వైసీపీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై ఈ తరహా విమర్శలతో రెండు సామాజికవర్గాలకు జగన్ వ్యతిరేకి అనే ముద్ర బలంగా వేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ లోని ఈ రెండు సామజిక వర్గాలు కూడా వైసీపీకి దూరమయ్యాయి.
అనాది నుండి బీసీ సామజిక వర్గాలు టీడీపీకి పెట్టని కోట. ఎన్టీఆర్ హయం నుండి ఇప్పటి వరకూ టీడీపీలో పెత్తనంతో పాటు పదవులలో కూడా బీసీలకు ప్రధాన వాటా ఉంటుంది. అయితే, 2019లో కొద్ది శాతం బీసీలను రకరకాల మార్గాల ద్వారా వైసీపీ ఆకర్షించింది. కానీ ఈ నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు కూడా జగన్ దూరమయ్యారు. బీసీలలో ఎక్కువ శాతం ప్రజలకు ప్రధాన జీవనోపాధి వ్యవసాయం. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఏం చేద్దాం అనే మాటే వినిపించకుండా చేశారు. వ్యవసాయం అంటే రైతు భరోసా బటన్ నొక్కడమే అనుకున్న సీఎం పట్ల సీఎం సొంత సామాజికవర్గ రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అటు కులాల మధ్య చిచ్చు పెట్టడం.. తమ వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఈ సామజిక వర్గాలన్నీ వైసీపీకి దూరమై టీడీపీ, జనసేన కూటమికి చేరువయ్యారు. ప్రజల పోలరైజేషన్ మధ్య వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుండగా.. ఇది జగన్ తప్పిదాల వలనే ప్రజలకు తెలిసొచ్చిందని పరిశీలకులు అంటున్నారు.