Leading News Portal in Telugu

Fastest Half Century: యువరాజ్‌ సింగ్ రికార్డు బద్దలు.. 11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదిన భారత ప్లేయర్!


Fastest Half Century: యువరాజ్‌ సింగ్ రికార్డు బద్దలు.. 11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదిన భారత ప్లేయర్!

Ashutosh Sharma hits Fastest T20 Half Century in Balls: 16 ఏళ్ల కిందట టీ20ల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ రికార్డు బద్దలైంది. రైల్వేస్‌ బ్యాటర్‌ అశుతోష్‌ శర్మ 11 బంతుల్లోనే అర్ధ శతకం చేసి యువీ రికార్డును బ్రేక్‌ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్‌ సిలో అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశుతోష్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ జట్టు తరఫున బరిలోకి దిగిన అశుతోష్ శర్మ.. అరుణాచల్ ప్రదేశ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి బంతి నుంచే బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 11 బంతుల్లో 8 సిక్సులు, 1 ఫోర్ సహాయంతో హాఫ్ సెంచరీ బాదేశాడు. అతడి స్ట్రైక్ రేట్‌ 441.66. దీంతో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం అశుతోష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది.

ఇక ఆసియా గేమ్స్ 2023 ముందువరకు ప్రపంచ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ యువరాజ్ సింగ్ పేరునే ఉంది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్ దీపెంద్ర సింగ్ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువీ రికార్డు బ్రేక్ చేశాడు. 9 బంతుల్లో 8 సిక్సర్లు బాదడం విశేషం. ఆ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ 10 బంతుల్లో 520 స్ట్రైక్‌రేట్‌తో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా నమోదైంది. నేపాల్ బ్యాటర్‌గా కుశాల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగుల తేడాతో రైల్వేస్ ఘన విజయం సాధించింది. అశుతోష్ శర్మ సహా ఉపేంద్ర యాదవ్‌ (103 నాటౌట్; 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీ బాదడంతో రైల్వేస్ 246/5తో ఇన్నింగ్స్‌ను ముగించింది. చివరి ఐదు ఓవర్లలో రైల్వేస్ 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 119 పరుగులకే ఆలౌటైంది.