Leading News Portal in Telugu

NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్‌!


NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్‌!

Netherlands Bowler Paul van Meekeren’s Uber Eat Tweet Goes Viral: వన్డే ప్రపంచకప్‌ 2023లో రెండో సంచలనం నమోదైన విషయం తెలిసిందే. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్తాన్ మట్టికరిపించగా.. తాజాగా పటిష్ట దక్షిణాఫ్రికాను మరో పసికూన నెదర్లాండ్స్‌ ఓడించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆపై ప్రొటీస్ 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టు విజయంలో పేసర్ పాల్ వాన్ మీకెరెన్ కీలక పాత్ర పోషించాడు. 9 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. దాంతో మీకెరెన్ మూడేళ్ల కిందట చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘ఈ రోజు నేడు క్రికెట్‌ ఆడుతూ ఉండాల్సింది. కానీ చలికాలంలో ఉబెర్ ఈట్స్ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా చేస్తున్నా. పరిస్థితులు ఎలా మారిపోయాయో? కదా. హహ్హహ్హ. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి’ అని పాల్‌ వాన్‌ మీకెరెన్ 2020లో పోస్టు పెట్టాడు. అది ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టీ20 ప్రపంచకప్‌ మరుసటి ఏడాదికి వాయిదా పడటంతో.. కుటుంబ పోషణ కోసం ఉబెర్ ఈట్స్ లో మీకెరెన్ ఫుడ్‌ డెలివరీ చేశాడు.

గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను ఫుడ్‌ డెలివరీ చేసిన విషయం వాన్‌ మీకెరెన్‌ తెలిపాడు. ‘కరోనా సమయంలో క్రికెట్‌ ఆడేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. ఉద్యోగం చేయాలనుకున్నా. కుటంబ పోషణ (నిత్యావసరాలు, పెట్రోలు, ఆహారం, ఇంటి అద్దె, ఫోన్ బిల్లులు) కోసం పని చేయాలి. క్రికెట్‌ జట్టు నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు కాబట్టి దానికి అనుకూలంగా ఉండే జాబ్స్‌ కోసం ప్రయత్నించా. నా స్నేహితుల ద్వారా ఫుడ్‌ డెలివరీ ఉద్యోగం దక్కింది. ఈ పని చేయడానికి నేను సిగ్గు పడలేదు’ అని మీకెరన్‌ చెప్పాడు.