
Dearness Allowance Hike: పండుగకు ముందే ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు మోడీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపునకు ఆమోదం తెలిపింది. డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు. అక్టోబరు 18 నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు ఆమోదం లభించింది. కరువు భత్యం పెంపుతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను కూడా అక్టోబర్ నెల జీతంతో పాటు కేంద్ర ఉద్యోగులు.. పెన్షనర్లకు ఇవ్వవచ్చు.
నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 24న దసరా, నవంబర్ 12న దీపావళి. ఈ పండుగల కల్లా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం పొందుతారు. ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. అయితే, రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న సెప్టెంబర్‌లో 5.02 శాతానికి పడిపోయింది. అంతకుముందు జూలై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి చేరుకుంది. ఆగస్టులో 9.94 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 6.56 శాతానికి తగ్గింది. కానీ గోధుమలు, బియ్యం, పప్పులు, పంచదార ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి.