చంద్రబాబు లీగల్ ములాఖత్ కుదింపు వెనక మరో కుట్ర? | babu leagal mulakhat Aridgment| another| conspiracy| advocates| only| once
posted on Oct 18, 2023 3:23PM
వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై దాదాపు 40 రోజులు కావస్తోంది. కోర్టులలో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. సీఐడీ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో ఘోరంగా విఫలమైంది. మొత్తానికి ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ, వాదనలు ముగిసాయి. తీర్పు రిజర్వులో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై శుక్రవారం (అక్టోబర్ 20) తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకూ చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయనను కలిసేందుకు ములాఖత్ సాధారణంగానే ఉండేది. సాధారణంగా కుటుంబ సభ్యులు, మిత్రులకు ములాఖత్ లో అవకాశం ఇస్తారు. ఇలా వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా లీగల్ ములాఖత్ అని మరో అప్షన్ కూడా ఉంటుంది. ఈ లీగల్ ములాఖత్ లో న్యాయవాదులు చంద్రబాబును రోజుకు రెండుసార్లు కలిసే వెసులు బాటు ఉంటుంది.
చంద్రబాబు విషయంలో కూడా ఇప్పటి వరకూ అలాగే వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులు, మిత్రులకు.. రోజుకు రెండుసార్లు లాయర్లకు ములాఖత్ అవకాశం ఇచ్చారు. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు ఒక్కసారిగా ములాఖత్ సంఖ్యను కుదించినట్లు జైళ్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇకపై రోజుకు ఒక్కసారి మాత్రమే లీగల్ ములాఖత్ కు అవకాశం ఇస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. గతంలో వారానికి రెండుసార్లు ఉన్న ఫ్యామిలీ-ఫ్రెండ్స్ ములాఖత్ ను కూడా వారానికి ఒక్కసారికి పరిమితం చేయనున్నట్లు చెబుతున్నారు. నిత్యం న్యాయవాదులు చంద్రబాబును కలుస్తుండడంతో జైలులో ఉన్న ఇతర ఖైదీలు ఇబ్బంది పడుతున్నారని.. ఈ కారణంతోనే చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జైళ్ళ శాఖ డీఐజీని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేశారు. జైళ్ల శాఖ ఈ ములాఖత్ కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నది.
నిజానికి రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ అనేది చంద్రబాబు హక్కు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు.. సాధారణంగా అందరికీ ఉన్న హక్కు. అయితే ఇతర ఖైదీలకు ఇబ్బంది కారణంగా ఒక్క చంద్రబాబు ములాఖత్ సంఖ్యను ఒకటికి కుదించడం అంటే హక్కులను కాలరాయడమే అవుతుంది,
అయితే, చంద్రబాబు లీగల్ ములాఖత్ సంఖ్యను రెండు నుంచి ఒకటికి కుదించడం వెనుక భారీ కుట్ర ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లీగల్ ములాఖత్ ద్వారానే చంద్రబాబు అటు పార్టీ వ్యవహారాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారని.. మరోవైపు కేసుకు సంబంధించి కూడా న్యాయ నిపుణులతో కీలక అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు నడిపిస్తున్నారని వైసీపీ బలంగా అనుమానిస్తోంది. అందుకే పార్టీతో పాటు కేసు విషయంలో చంద్రబాబు యాక్టివిటీ తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఈ తరహా సాకులతో చంద్రబాబు లీగల్ ములాఖత్ ను రెండు సార్లు నుంచి ఒక సారికి తగ్గించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
స్కిల్ కేసు పై ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు విచారణలు కొనసాగుతున్నాయి. ఒక్క స్కిల్ స్కామ్ కేసే కాదు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసుతో పాటు తాజాగా అమరావతి సీఆర్డీఏ కేసును కూడా మళ్ళీ రీ ఓపెన్ చేయాలనీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇలా అన్ని రకాల కేసులపై ఏకకాలంలో కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు విచారణలు కొనసాగుతున్న క్రమంలో పదుల సంఖ్యలో లాయర్లు జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. అది అవసరం కూడా. ఈ క్రమంలోనే ములాఖత్ పై ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం జైళ్ల అధికారుల ద్వారా ఈ తరహా కుట్రకు తెరతీసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జైళ్ల శాఖ డీజీపీ దృష్టికి తెలుగుదేశం తీసుకువెళ్లింది. ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.