
Festive Season Sale : ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు రాబోయే పెళ్లిళ్ల సీజన్‌కు పెద్ద ఎత్తున అమ్మకానికి సిద్ధంగా ఉన్నారు. దీపావళి ముగిసిన వెంటనే పెళ్లిళ్ల సీజన్‌లో ఈసారి దేశంలోని వ్యాపారవేత్తలు భారీ బిజనెస్ ఆశిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 23 ఏకాదశి నుండి వివాహాల సీజన్ ప్రారంభమై డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల వివాహాలు జరగొచ్చని అంచనా. ఈ సీజన్‌లో పెళ్లిళ్ల షాపింగ్, వివాహానికి సంబంధించిన వివిధ రకాల సేవల ద్వారా దాదాపు రూ.4.25 లక్షల కోట్ల భారీ వ్యయం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) దేశంలోని 20 ప్రధాన నగరాల వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లలో ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఈ సీజన్‌లో ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా వేసింది. దీని వల్ల ఢిల్లీలో దాదాపు రూ.లక్ష కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. గతేడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా, ఖర్చు రూ.3.75 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
క్యాట్‌కి చెందిన ప్రవీణ్ ఖండేల్‌వాల్ ప్రకారం.. ఈ పెళ్లిళ్లలో దాదాపు 6 లక్షల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి రూ.3 లక్షలు ఖర్చవుతుందని అంచనా. 10 లక్షల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి రూ.6 లక్షలు, 12 లక్షల పెళ్లిళ్లలో రూ.10 లక్షలు, 6 లక్షల పెళ్లిళ్లలో పెళ్లికి రూ.25 లక్షలు, 50 వేల పెళ్లిళ్లలో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించనున్నారు. 50 వేల వివాహాలకు ఒక్కో పెళ్లికి రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఒక నెల రోజుల వివాహ సీజన్లో వివాహ సంబంధిత వస్తువులు సేవల కొనుగోలు ద్వారా రూ. 4.25 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు.
పెళ్లిళ్ల సీజన్‌లో మంచి వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు విస్తృతంగా సన్నాహాలు చేశారని ఖండేల్వాల్ చెప్పారు. వినియోగదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు తమ ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉంచుతున్నారు. ప్రతి వివాహానికి అయ్యే ఖర్చులో దాదాపు 20 శాతం వధూవరుల పక్షానికి, 80 శాతం ఖర్చు ఇతర థర్డ్ ఏజెన్సీలకు ఖర్చు అవుతుందని చెప్పారు.
పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ఇళ్లకు మరమ్మతులు చేయడం, ఇళ్లకు రంగులు వేయడం వంటి భారీ వ్యాపారం జరుగుతుంది. ఇవే కాకుండా ఆభరణాలు, చీరలు, లెహంగా-చునీ, ఫర్నీచర్, రెడీమేడ్ బట్టలు, బట్టలు మొదలైన వాటి వ్యాపారం ఉంది. షూస్, వెడ్డింగ్, గ్రీటింగ్ కార్డ్‌లు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా వస్తువులు, కిరాణా, ఆహార ధాన్యాలు, అలంకార వస్తువులు, గృహాలంకరణ వస్తువులు, ఎలక్ట్రికల్ యుటిలిటీస్, ఎలక్ట్రానిక్స్, అనేక గిఫ్ట్ ఐటమ్స్ మొదలైన వాటికి సాధారణంగా డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం ఈ రంగాలే కాకుండా ఇతర వ్యాపారాలకు కూడా డిమాండ్ ఉంది.
ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా వివాహాల కోసం బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, ఓపెన్ లాన్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్‌హౌస్‌లు.. అనేక ఇతర రకాల వేదికలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఖండేల్వాల్ చెప్పారు. వస్తువుల సేకరణతో పాటు, ప్రతి పెళ్లిలో టెంట్ డెకరేటర్, ఫ్లవర్ అరేంజ్‌మెంట్, క్రాకరీ, క్యాటరింగ్ సర్వీస్, ట్రావెల్ సర్వీస్, క్యాబ్ సర్వీస్, ప్రొఫెషనల్ గ్రూప్‌ల రిసెప్షన్, కూరగాయల విక్రయదారులు, ఫోటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, బ్యాండ్‌లు మొదలైన అనేక రకాల సేవలు ఉంటాయి. బాజా, షెహనాయ్, ఆర్కెస్ట్రా, డీజే, ఊరేగింపు కోసం గుర్రాలు, క్యారేజీలు, లైట్లు ఇలా అనేక రకాల సేవలు ఈసారి పెద్ద వ్యాపారం చేసే అవకాశం ఉంది. దీనితో పాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కూడా పెద్ద వ్యాపారం కానుంది.