
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నరుకు తెలుగు తమ్ముళ్లు వివరించారు. 17Aపై కీలక వాదనలు జరిగిన క్రమంలో గవర్నర్ తో టీడీపీ నేతల భేటీ కీలక పరిణామమనే చెప్పవచ్చు.. చంద్రబాబు కేసులపై గవర్నర్ ఇప్పటికే ఆరా తీశారనే ప్రచారం కొనసాగుతుంది. 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని గవర్నర్ కు టీడీపీ శ్రేణులు తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులేంటీ..? అందులోని వాస్తవాలేంటి..? అనే అంశాన్ని టీడీపీ నేతలు గవర్నర్ కు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ తీరు.. చంద్రబాబుపై అక్రమ కేసుల విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 50 పేజీల నివేదికని గవర్నర్ కు సమర్పించాం.. ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై నివేదికలు తెప్పించుకుని.. కేంద్రానికి నివేదించాలని గవర్నర్ ను కోరామని ఆయన చెప్పారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలుకుని ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించామని అచ్చె్న్న అన్నారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా కేసులు పెడుతున్నారని ఆధారాలతో సహా గవర్నరుకు వివరించామన్నారు.
చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. జైల్లో బంధించిన తీరును గవర్నర్ నజీర్ కు వివరించామని అచ్చెన్నాయుడు చెప్పారు. ముందు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామని సీఐడీ చేస్తున్న సిగ్గులేని వాదనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.. చంద్రబాబుపై పెట్టిన స్కిల్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని వివరించాం.. ఈ మూడు కేసులపై టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు అందించాం అని ఆయన తెలిపారు. తన పరిధి మేరకు ఎంత వరకు చర్యలు తీసుకోవాలో అంత వరకు తీసుకుంటామని గవర్నర్ అబ్దుల్ నజీర్ సానుకూలంగా స్పందించారు.. ఈ కేసు మొత్తం అంశాలన్ని తనకు తెలుసని గవర్నర్ చెప్పారు.. కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి ఇంత కంటే ఎక్కువ మాట్లాడనని గవర్నర్ అన్నారు అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.