
Congress Bus Yatra 2023: ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం వేదికగా కాంగ్రెస్ విజయభేరి యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రారంభించారు. రామప్ప దేవాలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డుకు పూజలు నిర్వహించారు. ఆలయం నుంచే విజయభేరీ బస్సు యాత్రను వారు ప్రారంభించారు. అనంతరం బస్సులో ములుగు జిల్లా రామానుజపురం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ప్రసిద్ధ రామప్ప దేవాలయంలో ప్రాచీన శిల్ప కళ నైపుణ్యాల గురించి రాహుల్, ప్రియాంక అడిగి తెలుసుకున్నారు. రామప్ప దేవాలయం చరిత్ర గురించి రాహుల్, ప్రియాంకలకు ఆలయ నిర్వాహకులు వివరించారు. రామప్ప ఆలయం చుట్టూ తిరిగి శిల్ప కళను రాహుల్, ప్రియాంకలు తిలకించారు. ఈ కాంగ్రెస్ విజయభేరీ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంకలతో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఇంఛార్జి థాక్రే పాల్గొన్నారు.