Leading News Portal in Telugu

Joe Biden: ఆవేశంతో అమెరికా చేసిన తప్పుల్ని ఇజ్రాయిల్ చేయొద్దు..


Joe Biden: ఆవేశంతో అమెరికా చేసిన తప్పుల్ని ఇజ్రాయిల్ చేయొద్దు..

Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్‌కి అమెరికా మద్దతు తెలియజేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ రోజు ఆ దేశానికి వెళ్లారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరువురు నాయకుడు కొనసాగుతున్న యుద్ధం గురించి చర్చించారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా క్రూరంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే యుద్ధంలో బైడెన్ ఇజ్రాయిల్ కి పలు సూచనలు చేశారు. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్‌పై ఉగ్రవాదులు చేసిన దాడుల తర్వాత అమెరికా ఆవేశంతో చేసిన తప్పుల్ని ఇజ్రాయిల్ పునావృతం చేయొద్దని సూచించారు. కోపంతో కళ్లు మూసుకోవద్దని హెచ్చరించారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అనేక తప్పులు చేసిందని తెలిపారు. మేము న్యాయం కోరినప్పుడు, న్యాయం పొందినప్పుడు కూడా తప్పులు చేశామని హెచ్చరించారు.

ఇజ్రాయిల్ పర్యటనకు వచ్చిన సందర్భంలో జో బైడెన్ పాలస్తీనాకు భారీ సాయాన్ని ప్రకటించారు. గాజా, వెస్ట్ బ్యాంకుకు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించారు. గాజా ప్రజలకు నీరు, ఆహారం, మందులు, ఆశ్రయం అవసరమని ఆయన అన్నారు. గాజాలోని పౌరుల ప్రాణాలు రక్షించేందుకు మానవతా సాయాన్ని అందించడానికి ఇజ్రాయిల్ అంగీకరించాలని కోరినట్లు ఆయన తెలిపారు. సాయం కింద ప్రకటించిన డబ్బు ఘర్షణల్లో దెబ్బతిన్న పాలసీనా ప్రజలకు మద్దతు ఇస్తుందని, ఈ సాయం అవసరమైన వారికి చేరుకోవడానికి మాకు యంత్రాంగం ఉందని అన్నారు. హమాస్, ఇతర తీవ్రవాద గ్రూపుల అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.