Leading News Portal in Telugu

ఆ ఒక్కటీ అడక్కండి.. బాబు కేసులో సర్కర్ లాయర్ల వాదనల తీరు! | babu skill case| govt lawyers| drag| show| evidene| adjourn| fear| ycp


posted on Oct 19, 2023 9:53AM

చంద్రబాబు అక్రమ అరెస్టు..తదననంతర పరిణామాలతో వైసీపీ నేతలలో గుబులు రేగుతోంది. చంద్రబాబు  అరెస్టుతో ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహ జ్వాలలు తమ రాజకీయ భవిష్యత్ ను సమాధి చేయడం ఖాయమని ప్రైవేటు సంభాషణల్లో  చెబుతున్నారు. రేపు వైసీపీ పరాజయం పాలైతే.. వచ్చే కొత్త సర్కార్ ఇదే పద్ధతిని అనుసరిస్తే మన పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై 40 రోజులు అయ్యింది.  

ఆధారాలు లేకుండా కేసు పెట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని ఇన్ని రోజులుగా ఆయన చేసిన న్యాయపోరాటంలో పసలేని ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తొలుత అర్ధరాత్రి ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేసినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో తెలుగువారున్న ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిలు తీసుకుని బయటకు రావడం కాకుండా అసలు తన అరెస్టు, తనపై కేసే తప్పని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఎవరైనా.. ఇంత అడ్డగోలుగా, ఒక ప్రజా ప్రతినిథిని అరెస్టు చేసేయొచ్చా అని ఆశ్చర్యపోతారు.

ఆధారాలు చూపమని న్యాయస్థానం ఆదేశిస్తే.. ఆ ఒక్కటీ  అడక్కండి అన్నట్లుగా ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయి. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. 

చంద్రబాబు, తెలుగుదేశం ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే.. రెండో వైపు చంద్రబాబు అక్రమ అరెస్టు రాజకీయ వేధింపులలో భాగమేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ మీడియా వేదికగా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. న్యాయవాదులు కోర్టులకు కూడా ఇదే విషయాన్ని విన్నవించారు. అమిత్ షా స్వయంగా  లోకేష్ ను పిలిపించుకుని విషయాన్ని ఆరాతీశారు. చంద్రబాబు  ఆరోగ్య పరిస్థితి గురించీ వాకబు చేశారు. ఇది జరిగి వారం రోజులు దాటిపోయినా.. బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబు అరెస్టు విషయంలో ఎటువంటి స్పందనా రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులే కాకుండా, గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే బీజేపీ అగ్రనేతలు అ మిత్ షా, మోడీల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. అది మినహా రాజకీయాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నేతలూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ ఉద్యోగులూ..ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. 

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయనిపుణులు సైతం చెబుతున్నారు. అయినా కోర్టులలో మాత్రం కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. చివరాఖరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది. ఆ తీర్పు శుక్రవారం (అక్టోబర్ 19) వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న విషయంపైనే అందరి దృష్టీ ఉంది. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా జరిగిన వాదనలూ, వాటిపై న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలను గమనించిన న్యాయనిపుణులు కచ్చితంగా సుప్రీం లో చంద్రబాబుకు ఊరట లభిస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని చెబుతున్నారు.

అయినా గత 40 రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సామాన్య జనంలో మాత్రం ఎక్కడో ఏ మూలో ఒక సందేహం పట్టి పీడిస్తోంది. అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిలు మీద ఉన్న ముఖ్యమంత్రి జగన్, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతుంటే.. ఎటువంటి ఆధారాలూ లేని కేసులో చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉండటమంటే ఏపీలో న్యాయం, ధర్మం అనే మాటలకు అర్ధం లేకుండా పోయిందా అని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఇక ఇప్పుడు ఈ పద్ధతులనే ఉపయోగించి పార్టీలోని ఇతర ముఖ్య నేతలను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నదన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముందు అరెస్టు చేసి.. ఏవో సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడితే చాలు.. అక్కడా జగన్ సర్కార్ కు తెలిసిన సాగదీత విధానాలతో రోజుల తరబడి బెయిలు రాకుండా వాదనలు కొనసాగించే కొత్త పద్ధతికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాజకీయ అరాచకత్వానికి ఇది పరాకాష్ట అనీ, రేపు ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైతే.. అప్పుడు జగన్ పరిస్థితి ఏమిటని పరిశీలకులు అంటున్నారు. ఇదే ఆందోళన వైసీపీ నేతలలో కూడా వ్యక్తం అవుతోంది. కొందరైతే బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. అయితే ఈ తీరు సరికాదనీ, కక్ష సాధింపు రాజకీయాలతో తాత్కాలికంగా పై చేయి సాధించినా, ముందు ముందు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనీ వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు అక్రమ అరెస్టు తమ రాజకీయ భవిష్యత్ నే ప్రమాదంలో పడేసిందన్న ఆందోళన వైసీపీ సీనియర్ నేతలలో వ్యక్తం అవుతోంది. ధర్మాన, తమ్మినేని లాంటి వారు కార్యకర్తల సమావేశాల్లో, ప్రైవేటు మీటింగులలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.