Leading News Portal in Telugu

IND vs BAN: తస్మాత్‌ జాగ్రత్త.. భారత ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ హెచ్చరిక!


IND vs BAN: తస్మాత్‌ జాగ్రత్త.. భారత ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ హెచ్చరిక!

Virat Kohli Warns Indian Players Ahead Of IND vs BAN Match: వన్డే ప్రపంచకప్‌ 2023లో పూణే వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో భారత్ బౌలింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సహచరులకు ఓ హెచ్చరిక చేశాడు. మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచుల్లో సంచలనాలు నమోదైన వేళ.. మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ‘తస్మాత్‌ జాగ్రత్త’ అని సూచించాడు. అఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు పటిష్ట జట్లకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్‌లో పెద్ద జట్లు అని ఏమీ లేవు. ఎక్కువ విజయాలు సాధించే జట్లపైనే దృష్టి సారించినప్పుడు సంచలనాలు నమోదవుతాయి. ఏ జట్టును తేలికగా తీసుకోవద్దు. బంగ్లాదేశ్‌ పటిష్ట జట్టు. చాలా మంది మంచి ప్లేయర్స్ ఆ టీమ్ సొంతం. షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌లో చాలా సార్లు ఆడాను. బంతిపై అతనికి మంచి నియంత్రణ ఉంటుంది. అనుభవజ్ఞుడైన బౌలర్‌ మాత్రమే కాకుండా కొత్త బంతితోనూ బ్యాటర్‌ను బోల్తా కొట్టించగలడు. మిగతా వారు కూడా బాగా బౌలింగ్ చేస్తారు. బంగ్లాదేశ్‌ బౌలర్లతో జాగ్రత్తగా ఆడాలి. లేదంటే ఒత్తిడికి గురిచేసి వికెట్‌ సమర్పించుకొనేలా చేస్తారు’ అని హెచ్చరించాడు.

విరాట్ కోహ్లీ వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మద్దతు తెలిపాడు. ‘షకీబ్ ఉల్ హాసన్ అద్భుతమైన క్రికెటర్‌. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ను గత కొన్నేళ్లుగా అతడి తన భుజాలపై మోస్తున్నాడు. ఇంకా చాలా మంది సత్తా ఉన్న ప్లేయర్స్ బంగ్లా జట్టులో ఉన్నారు. వారి నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. అయితే మా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు. షకీబ్ గాయంతో ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశం.