వ్యక్తిగత వైద్యునితో పరీక్షలు.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అనుమతి | hi court allows babu personal doctor| health| tests| skill| case| bail| petition
posted on Oct 19, 2023 3:53PM
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణకు ఏపీ హై కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ దసరా తరువాత చేపట్టనున్నట్లు తెలిపింది. అయితే ఒక విషయంలో మాత్రం చంద్రబాబుకు హైకోర్టు ఊరట కల్పించింది. చంద్రబాబు వ్యక్తిగత వైద్యునితో పరీక్షలకు అనుమతి ఇచ్చింది. ఇక బెయిల్ పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదలీ చేసింది.
కాగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరీక్షల వివరాలను జైలు అధికారులు గోప్యంగా ఉంచడం, వారు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో సమగ్ర సమాచారం లేకపోవడంతో చంద్రబాబు కుటుంబసభ్యులు, తెలుగుదేశం శ్రేణులూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయనకు చేసిన వైద్య పరీక్షల వివరాలను బయటపెట్టాలనీ, అలాగే ఆయనకు ఇచ్చిన మందుల వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలనీ డిమాండ్ చేశారు.
అయితే జైలు అధికారులు అందుకు అంగీకరించలేదు. ఆ తరువాత వైద్యులు చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై సమగ్రనివేదికను సీల్డ్ కవర్ లో జైలు అధికారులకు వెల్లడించినట్లు బయటపడటంతో ఆ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. చంద్రబాబు నెల రోజులలో ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటిక్ పేషెంట్ అయినా చంద్రబాబు సుగర్ లెవెల్స్ పరీక్షించకపోవడం, అలాగే ఆయనకు అందించిన చికిత్స, ఇచ్చిన మందులపై వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు ఆయన వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో తెలుగుదేశం వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇలా ఉండగా స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం(అక్టోబర్ 20)న తీర్పు వెలువరించనుంది.