
Himanta Biswa Sarma: బీజేపీకి లౌకికవాదాన్ని నేర్పించవద్దని అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న ఛత్తీస్గఢ్ లోని కవార్దా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్, మతమార్పిడి సంఘటనలు పెరుగుతున్నాయని అన్నారు.
లవ్ జిహాద్, మతమార్పిడి, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేమని, ఛత్తీస్గఢ్ లో గిరిజనులు క్రైస్తవ మతంలోకి మారడానికి ప్రతీ రోజూ ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తిన సందర్భంలో భూపేష్ బఘేల్ తనను తాను లౌకికవాదిగా చెప్పుకుంటారని హిమంత విమర్శించారు.
హిందువులను చంపడం లౌకికవాదమా..? ఈ దేశం హిందువులదే, ఇది హిందువులకే చెందుతుంది, మాకు సెక్యులరిజం భాష నేర్పకండి అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రామ మందిరాన్ని కూల్చివేసిన తర్వాత బాబర్ మసీదు కట్టడాన్ని సెక్యులరిజం అనడం సరికాదని అన్నారు. మతమార్పిడులను సెక్యులరిజం అనరని, మాత కౌలస్య భూమిని అక్బర్ కి అప్పగించడం సెక్యులరిజం కాదు, మన లౌకిక భావనను బాబా సాహెబ్ అంబేద్కర్, హిందూ సంస్కృతి అందించాయని, సెక్యులరిజం అంటే లవ్ జిహాద్ కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ బాబార్ ని పూజిస్తోంది, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామమందిరం నిర్మిస్తున్నామని, జనవరి నెలలో నిర్మాణం పూర్తవుతుందని హిమంత అన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉంది కానీ ఏనాడు రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించలేదని ఆయన ఆరోపించారు. ప్రధాని ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. లవ్ జిహాద్, మత మార్పిడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి రక్షించడానికి అక్బర్ కి వీడ్కోలు పలకాలని ప్రజలను కోరారు. బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు.