
Peethala Sujatha: టీడీపీ కార్యక్రమాలు.. భువనేశ్వరి, లోకేష్ నిర్ణయాలపై మంత్రులు నోరు పారేసుకుంటున్నారని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. మంత్రులు గతంలో జగన్ జైల్లో ఉంటే, ఆయన తల్లి.. చెల్లి.. భార్య ఏం చేశారో గ్రహించాలన్నారు. విజయమ్మ ఓదార్పు యాత్ర… షర్మిల పాదయాత్రలు ఎందుకు జరిగాయో ఎవర్ని మోసగించడానికి జరిగాయో అంబటి చెప్పాలన్నారు. భువనేశ్వరి ప్రజల్లోకి వస్తోందనగానే ముఖ్యమంత్రికి, మంత్రులకు మతి చలించిందన్నారు.
చంద్రబాబు కుటుంబానికి సమాధానం చెప్పలేకపోతున్నారని.. చంద్రబాబు తప్పు చేశాడని కోర్టుల్లో నిరూపించలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియని స్థితిలో ముఖ్యమంత్రి, మంత్రులు పిచ్చికూతలు కూస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమానులు చనిపోయారన్నది అబద్ధమా అంబటి అంటూ ఆమె ప్రశ్నించారు. వైఎస్ మరణంతో ఎవరూ చనిపోలేదని.. తన ప్రయోజనాల కోసం జగన్ ఆనాడు అబద్ధం చెప్పాడన్నది అంబటి రాంబాబు అభిప్రాయమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. గతంలో జగన్ తల్లి విజయమ్మ సానుభూతి కోసమే ఓదార్పు యాత్ర చేసిందా అంబటి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, జగన్ కక్షతో ఆయన్ని జైలుకు పంపాడని ప్రజలు గ్రహించారన్నారు.