
Rohit Sharma Slams Three Consecutive Centuries vs Bangladesh: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. పసికూనలు పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. దాంతో టోర్నమెంట్ ముందుకు సాగే కొద్ది అన్ని మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇక మెగా టోర్నీలో జోరు మీదున్న భారత్.. నేడు అండర్ డాగ్స్ బంగ్లాదేశ్‌తో పోటీ పడుతోంది. పూణేలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. ఐసీసీ ఈవెంట్లలో బంగ్లాదేశ్‌పై హిట్‌మ్యాన్‌కు ఘనమైన రికార్డు ఉంది.
ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్‌తో ఆడిన గత మూడు సందర్భాల్లో రోహిత్ శర్మ సెంచరీలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శతకం (126 బంతుల్లో 137 పరుగులు) చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సెంచరీ (129 బంతుల్లో 123 నాటౌట్) బాదాడు. ఇక 2019లో హిట్‌మ్యాన్ బంగ్లాదేశ్‌పై మరో సెంచరీ (92 బంతుల్లో 104) కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌పై ఐసీసీ టోర్నీల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. రోహిత్ గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ చూస్తే.. నేడు కూడా సెంచరీ చేసే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై వరుసగా నాలుగో సెంచరీ నమోదు చేయడం ఖాయమని నెట్టింట ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచకప్ 2023లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 72.33 సగటుతో 217 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఓ అర్ధసెంచరీ ఉన్నాయి. టోర్నీ లిడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి.. 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 4 విజయాలతో న్యూజిలాండ్ అగ్ర స్థానంలో ఉంది. ఈ రోజు భారత్ గెలిస్తే.. మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంటుంది.