
Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై జరిపిన దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. గాజా ప్రాంతాన్ని దిగ్భంధించి హమాస్ ఉగ్రవాద స్థావరాలపై నేలమట్టం చేస్తోంది.
ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానం కలిగిన ప్రతీ ప్రాంతాన్ని, ప్రతీ భవనాన్ని కూల్చేస్తోంది. ఈ భీకరదాడుల్లో హమాస్ మిలిటెంట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. గాజాలో ఇప్పటి వరకు 4137 మంది మరణించినట్లు హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 13,162 మంది గాయపడినట్లు ప్రకటించింది. మరణించిన వారిలో గురువారం అర్థరాత్రి గాజా నగరంలోని సెయింట్ పోర్పిరియస్ లోని గ్రీక్ ఆర్డోడాక్స్ చర్చి వద్ద మరణించిన 16 మంది కూడా ఉన్నట్లు తెలిపింది.
అయితే ఇజ్రాయిల్ వైపు రాకెట్లను ప్రయోగించడం వల్లే హమాస్ కి చెందిన ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’పై తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని సైన్యం తెలిపింది. ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణ తలెత్తినప్పటి నుంచి 46 మంది వైద్య సిబ్బంది మరణించినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఇచ్చిన వార్నింగ్ తో ఆ ప్రాంతం నుంచి లక్షల మంది దక్షిణ ప్రాంతానికి వెళ్లారు. దీంతో మానవతా సంక్షోభం ఏర్పడింది. ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ వద్ద గాజాలోకి ప్రవేశించడానికి మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు.