Leading News Portal in Telugu

Justin Trudeau: భారత అణిచివేతతో ఇరు దేశాల ప్రజలకు ఇబ్బందులు.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు..


Justin Trudeau: భారత అణిచివేతతో ఇరు దేశాల ప్రజలకు ఇబ్బందులు.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

Justin Trudeau: కెనడా, ఇండియాల మధ్య దౌత్య వివాదం తీవ్రమవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్యవేత్తలపై భారత ప్రభుత్వం అణిచివేతతో రెండు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తోందని ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు.

41 మంది దౌత్యవేత్తల హోదాను ఏకపక్షంగా తీసేస్తామని భారత్ హెచ్చరించడంతో కెనడా తన దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత రోజు ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ప్రభుత్వం భారతదేశం, కెనడాల్లో లక్షలాది మంది ప్రజల జీవనాన్ని యధావిధిగా కొనసాగించడాన్ని నమ్మలేనంత కష్టతరం చేస్తోంది, దౌత్యం యొక్క ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రూడో అన్నారు.

ఒంటారియోలోని బ్రాంఫ్టన్ లో టెలివిజన్ మీడియా సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించడం వల్ల ప్రయాణ, వాణిజ్యానికి ఆటంకం కలుగుతుందని, కెనడాలో చదువుతున్న భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతాయని ట్రూడో చెప్పారు. రెండు మిలియన్ల కెనడియన్లు, మొత్తం జనాభాలో 5 శాతం మంది భారతీయ వారసత్వాన్ని కలిగి ఉాన్నారు. విదేశాలకు చదువుకోవడానికి వెళ్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది కెనడాలోనే చదువుకుంటున్నారు.

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్య చేయబడ్డాడు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని భారత్ ఖండించడమే కాకుండా, ఆధారాలు చూపాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఇదే విధంగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.

ఇటీవల కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. అక్టోబర్ 10లోపు వారు వెళ్లకుంటే, దౌత్య పరమైన రక్షణను రద్దు చేస్తామని ప్రకటించింది. రెండు దేశాలు పరస్పర దౌత్యపరమైన ఉనికిలో సమానత్వాన్ని కోరుతున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో ఇప్పుడు కెనడాలో, ఇండియాలో 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. అయితే ఇది వియన్నా దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమే అని కెనడా ఆరోపించింది. దీనికి భారత్ ధీటుగానే స్పందిస్తూ.. సమానత్వాన్ని నిబంధనలు ఉల్లంఘించడంగా చెప్పొద్దు అని హితవు పలికింది.