Leading News Portal in Telugu

ప్రజలలో పెల్లుబుకుతున్న ఆక్రోశం.. సైకో ప్రభుత్వ పతనమే ధ్యేయం | people anger on psycho government| varalakshmi| mandada| women| criticise| jagan| ministers| faces


posted on Oct 21, 2023 11:51AM

ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాలపై విపక్షాలు విమర్శించడం సహజమే.  ఆ విమర్శలకు అధికార పార్టీ దానికి కౌంటర్లు ఇవ్వడమూ సాధారణమే.  ఏపీలో  కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అంతకు మించిన విమర్శలు ప్రజల నుంచే వస్తున్నాయి.   సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరిపై రాష్ట్ర ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై, ఆయన పాలనను ప్రజలు తూర్పారపడుతున్నారు.  జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మంత్రులు మాట్లాడే ప్రతి మాటపై విపక్షాల కంటే ముందే ప్రజలు కౌంటర్లు ఇస్తున్నారు. మండిపడుతున్నారు. అప్పుడెప్పుడో ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజా వేదిక కూల్చివేత, రాజధాని అమరావతి నిర్వీర్యం, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ ఒక్కో అంశాన్ని గుర్తు చేసుకొని మరీ ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఉపాధి, ఆరోగ్యంపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుతున్నారు. తమ తమ శాఖల పనితీరు, ఆయా శాఖలలో సాధించిన పురోగతి  తదితర అంశాలపై  మీడియా సమావేశం నిర్వహించాల్సిన మంత్రులు.. ప్రతిపక్ష నేతలపై దూషణల కోసం మాత్రమే మైకుల ముందుకు వస్తున్నారు. శాఖల వారీ సమీక్షల విషయమే మరచిపోయారు.  రాష్ట్రంలో పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీ ప్రతినిధులు కులాల గురించి, ప్రతిపక్షాల పొత్తుల గురించి, ప్రతిపక్ష పార్టీలలో అంతర్గత విషయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నేతలు ఎవరైనా.. ఎంతటి వారినైనా సభ్యత, సంస్కారం అన్న మాటే తెలియదన్నట్లు అనుచితంగా దూషణలకు దిగుతూ తమ దిగజారుడుతనాన్ని చాటుకుంటున్నారు. నేతల కుటుంబాలు, మహిళలు అని కూడా లేకుండా వేధిస్తున్నారు. కనీస ఆధారాలు కూడా లేకుండా కేసులు పెట్టడం, విమర్శలు చేయడం.. వివరణ అడిగితే వ్యతిగత జీవితాలపై విమర్శలు చేయడం ఇదే వైసీపీ నేతల తీరుగా మారిపోయింది.

వైసీపీ  పాలన,  వైసీపీ నేతల తీరుతో విసుగెత్తిన జనం తిరగబడుతున్నారు. అతి సామాన్య ప్రజలు కూడా ఆగ్రహంతో   బయటకి వస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే తమపై అక్రమ కేసులు పెడతారని.. వేధించి హింసిస్తారనీ తెలిసినా ప్రజలు వెనకడుగు వేయడం లేదు. ఒక్కో అంశంపై.. ఒక్కో వైసీపీ నేతను పేరుపేరునా కడిగిపారేస్తున్నారు. అలాంటి వీడియో  ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు శ్రీమతి వరలక్ష్మి. రాజధాని 29 గ్రామాల్లో ఒకటైన మందడం గ్రామానికి చెందిన ఈమె ఓ సాధారణ గృహిణి. కేవలం  రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 4 సెంట్లలో రేకులతో నిర్మించిన చిన్న ఇల్లు ఈమె కుటుంబ యావదాస్తి. అయితే, ఆమె కుటుంబానికి ఉన్న రెండెకరాలను ఆంధ్రుల ప్రజా రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చేశారు.

కానీ రాజధానిపై నీలినీడలు కమ్ముకోవడంతో సర్వం కోల్పోయి చట్ట ప్రకారం రావాల్సిన కౌలు రాక భవిష్యత్ కారు చీకటిగా మారి అంతులేని వేదనతో  బతుకీడుస్తున్నారు. కష్టాలు చుట్టుముట్టినా ఆమెలో చైతన్యం అణగారిపోలేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతెత్తేందుకు భయం అడ్డు రాలేదు.   ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి ఆమె మాటలకు తడుముకోలేదు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ  తీసుకున్న ఒక్కో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, పాల్పడిన అక్రమాలను ఒకదాని తరువాత ఒకటిగా గుక్క తిప్పకోకుండా కడిగి పారేశారు.  

మాస్కులు లేకుండా కరోనా వైద్యం ఎలా చేయాలని ప్రశ్నించిన దళిత వైద్యుడినే అక్రమ కేసులు పెట్టి చంపేసిన ప్రభుత్వం.. అంటూ ఆమె జగన్ సర్కార్ ను దుమ్మెత్తి పోసింది. ఇలాంటి సాధారణ గృహిణి ఇంతలా విమర్శిస్తే ఊరికే ఉంటారా. ఆమె బాధను వెళ్లగక్కిన పుణ్యానికి ఆమెపై అక్షరాల ఇరవై మూడు క్రిమినల్ కేసులు బనాయించింది జగన్ సర్కార్. రాక్షస కాండపై రాజ్యంగం కల్పించిన ప్రాథమిక హక్కును అహింసా మార్గంలో గొంతెత్తినందుకు ఆమెకు 23 క్రిమినల్ కేసులు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఒక సాధారణ మహిళ, తన ఆక్రందనను వెక్కగక్కుతూ గుక్క తిప్పుకోకుండా వైసీపీ నేతలను చీల్చి చెండాడిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తమ బాధ కూడా ఆమె మాటలలో కనిపిస్తున్నదని, మా మనసులలోని ఆవేదన ఆమె నుండి ఆక్రందనగా బయటకి వచ్చినట్లుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఒక్క వరలక్ష్మి ఆవేదన మాత్రమే కాదని.. రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకొనే ప్రతి పౌరుడి మనసులో మాటలేనంటూ ఆమెకి మద్దతు తెలుపుతున్నారు.