Leading News Portal in Telugu

1నుంచి జనంలోకి తెలుగుదేశం.. లోకేష్ దిశా నిర్దేశం | lokesh emotional on babu arrest| ttd| meeting| programmes| november1| direction


posted on Oct 21, 2023 2:22PM

నారా చంద్రబాబునాయుడు.. నాలుగున్నర దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా ప్రజాసేవలోనే ఉన్న నేత. అయినా చంద్రబాబునాయుడు కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలిన రాజకీయ నాయకుల్లో ముందు వరసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజనికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయతల మేలుకలయిక అనదగ్గ రాజనీతిజ్ఞుడు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవరంగాలలో దేశ విదేశాల్లో దూసుకుపోతున్నారు. ఈ  నాలుగున్నర దశాబ్దాలలో దేశంలో ప్రతి కీలక మలుపులోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అటువంటి దిగ్గజ నేతను ఏపీలోని జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. 43 రోజులుగా ఆయన  నిర్బంధంలోనే ఉన్నారు. క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లపై కోర్టులలో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ విషపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో  ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీకి దిశా నిర్దేశం చేస్తూనే చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం అని నినదించారు. జగన్ సర్కార్ అక్రమంగా బనాయించిన స్కిల్ కేసులో నిందితులుగా ప్రభుత్వం పేర్కొన్న వారంతా బెయిలుపై బయటకు వచ్చేశారనీ, కానీ చంద్రబాబు మాత్రం 43 రోజులుగా జైలులో ఉన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కంటనీరు పెట్టుకుంటూనే జగన్ సర్కార్ పై కన్నెర్ర చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్ సర్కార్ చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఆవేదన, ఆగ్రహం, ఆవేశం కలగలిసిన స్వరంతో ఆయన పార్టీలో గత 43 రోజులుగా ఉన్న స్థబ్దతను బద్దలు కొట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై జరుపుతున్న న్యాయపోరాటంలో గెలుపు తథ్యమని ఉద్ఘాటించారు.

చంద్రబాబు అరెస్టు తరువాత గత 43  రోజులుగా ఆగిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను  వచ్చే నెల 1వ తేదీ నుంచి  రెట్టించిన ఉత్సాహంతో మొదలు  పెట్టాలని పిలుపునిచ్చారు.  

చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, విద్యావంతులు ఆయన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆయనకు సంఘీభావం  తెలుపుతూ దేశ  విదేశాల్లో స్వచ్ఛందంగా  ఆందోళనలకు దిగుతున్నారు. ఆ విషయాలన్నీ ప్రస్తావించిన  లోకేష్ విస్తృతస్థయి సమావేశంలో పార్టీ  నేతలకూ, నియోజకవర్గ ఇన్ చార్జీలకూ దిశానిర్దేశం చేశారు. “బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ” కార్యక్రమాన్ని తిరిగి ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. జగన్ సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జగన్ రాష్ట్రంలో  ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనీ, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవలసిసన బాధ్యత తెలుగుదేశం భుజస్కంధాల మీద ఉందని చెప్పారు.  

విజిల్ వేస్తే కేసు,  కొవ్వొత్తి పట్టుకుంటే కేసు, గంట కొడితే కేసు  మన చేతులకు మనమే సంకెళ్లు వేసుకున్నా కేసు అంతెందుకు కదిలితే అరెస్టు, మెదిలితే నిర్బంధం అంటూ తెలుగుదేశం నేతలపై, తెలుగుదేశం మద్దతుదారులపై ఇష్టారీతిగా కేసులు నమోదు చేసి భయపెట్టాలని జగన్ సర్కార్ చూస్తోందనీ, అయితే తెలుగుదేశం డిక్షనరీలో భయం అన్న పదానికే చెటులేదని లోకేష్ అన్నారు. తెలుగుదేశం బయోడేటాలో భయం అన్నదేలేదన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

తప్పుడు ఆరోపణలతో, అక్రమ కేసులు పెట్టి బాబుని జైలుకు పంపిన జగన్ ఒక సైకో అని, దీనికి కచ్చితంగా రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం సరైన సమాధానం చెప్తుందని, ఈ సైకో ప్రభుత్వం వలన ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి న్యాయం చేసే గ్యారంటీ నాది అంటూ టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వారిలో ధైర్యం నింపారు.  ప్రజా వేదికను కూల్చడంతో మొదలు పెట్టిన తన దుష్టపాలన ప్రారంభించిన జగన్ ఈ నాలుగున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్వీర్యం సహా ఎన్నోఎన్నెన్నో దుర్మార్గాలను పాల్పడ్డారనీ,  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి ఏకంగా రాష్ట్రాన్నే కూల్చేందుకు సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు. వంద తప్పులతో శిశుపాలుడి పాపం బద్దలైనట్లు.. చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలు పండాయనీ, ఆయనను అరెస్టు చేసి తన గొయ్యి తానే తీసుకున్నారనీ, తన పతనాన్ని తానే లిఖించుకున్నారని లోకేష్ అన్నారు. నాలుగున్నరేళ్ల  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా అంటని బాబుపై నిరాధార ఆరోపణలు చేసి అక్రమంగా అరెస్టు చేసి జగన్ చేసిన తప్పుకు కచ్చితంగా రానున్న రోజులలో ఫలితం  అనుభవించకతప్పదని హెచ్చరించారు.  రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి,రాజకీయ కక్ష సాధింపులతో ప్రతిపక్ష నేతల పై కేసులు మోపి, “జే” టాక్స్ లతో పెట్టుబడి దారులను భయపెట్టి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేసి,రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన జగన్ ఒక భస్మాసరుడనీ, బాబు అక్రమ అరెస్టుతో జగన్ తన నెత్తిన తానే చేయిపెట్టున్నట్లైందనిలోకేష్ చెప్పారు.