posted on Oct 21, 2023 2:20PM
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి రాజాసింగ్ కావడం గమనార్హం. ఇవ్వాళో, రేపో బిజెపి మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో తెలంగాణ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ పై గత సంవత్సరం ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆరోపణతో సస్పెన్షన్ అయ్యారు. ఎన్నికల సందర్బంగా బిజెపి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినప్పటికీ రాజాసింగ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాజాసింగ్ హిందుత్వ నినాదంతో దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు.తనకు బిజెపి టికెట్ ఇవ్వకపోతే ఇతర పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడనని రాజాసింగ్ ప్రకటించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న రాజాసింగ్ నిండు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదే నా చివరి అసెంబ్లీ సమావేశాలు అని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ కమెడియన్ మునావర్ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే.
రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరగ్రేటం చేశాడు. అతను 2009 హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి, 2009 నుండి 2014 వరకు కార్పోరేటర్ గా గెలిచాడు. తొలిసారి ఎమ్మెల్యేగా రాజాసింగ్ బిజెపి నుంచి గెలిచారు.2014లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. రెండోసారి అంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీచేసి తెలంగాణ అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ముచ్చటగా మూడోసారి కూడా తానే గెలుస్తానని ఇప్పటికే రాజాసింగ్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారసభలో పేర్కొంటున్నారు. గోషామహల్ టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.