Leading News Portal in Telugu

Israel: హమాస్ డిప్యూటీ లీడర్ ఇంటిపై ఇజ్రాయిల్ దాడులు..


Israel: హమాస్ డిప్యూటీ లీడర్ ఇంటిపై ఇజ్రాయిల్ దాడులు..

Israel: ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాద సంస్థను నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో ఉంది. వెతికివెతికి కీలక హమాస్ నాయకులను టార్గెట్ చేస్తూ హతమారుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది మరణించారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ హమాస్‌ని నేలమట్టం చేస్తామని ప్రమాణం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా వెస్ట్ బ్యాంకులోని హమాస్ కీలక నేత, డిప్యూటీ లీడర్ ఇంటిపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. అతని కుటుంబాన్ని అదుపులోకి తీసుకుంది. శనివారం ఈ దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. హమాస్ అధినేతగా ఇస్మాయిల్ హనియే ఉండగా.. అతని తర్వాతి స్థానంలో డిప్యూటీగా సలేహ్ అల్-అరూరి ఉన్నారు. ఇస్లామిస్ట్ గ్రూప్ సైనిక విభాగంలో అరూరి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.

సలేహ్ అల్-అరూరి ఇజ్రాయిల్ ప్రధాన టార్గెట్లలో ఒకడిగా ఉన్నాడు. శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంకులోని రమల్లాకు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలోని అరూరా గ్రామంలోని అరూరి ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేసింది.అతని సోదరుడితో పాటు అతని 9 మంది మేనల్లుళ్లతో సహా 20 మందికి పైగా వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు మేయర్ అలీ అల్ -ఖాసిబ్, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

2017లో హనియే డిప్యూటీగా ఉన్న అరూరి అనేక దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. సలేహ్ అల్-అరూరి దాదాపుగా 20 ఏళ్ల పాటు ఇజ్రాయిల్ జైలులో గడిపాడు. అతను ప్రవాసంలోకి వెళ్లాలనే షరతుపై 2010లో విడుదలయ్యారు. గాజాలో వివాదం మొదలైన తర్వాత వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయిల్ దళాలతో జరిగిన సంఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.