
ఖమ్మంలో రాజకీయ మార్పులు చాలా జరిగాయన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఖమ్మంలో పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజల స్వేచ్ఛ కోసం స్వతంత్రంగా వుండే విధంగా కుటుంబాలు ఆనందంగా వుండేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతిపక్షంలో వుండి కూడా కాంగ్రెస్ వారితో దెబ్బలాడి సురక్షితంగా ఖమ్మంలో మంచినీళ్ళు ఇప్పించేందుకు ప్రయత్నం చేశానన్నారు. ఆనాడే ఖమ్మం లో రహదారుల విస్తరణ అభివృద్ధి చేశా, హైదరాబాద్ పట్టణానికి ఎంత గౌరవం వచ్చిందో అంత గౌరవం ఖమ్మం కు ఇప్పించెలా చేశానని, ఎన్టీఆర్ బాట లో ప్రయాణం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో జనాలు అభివృద్ధి కావాలని అడిగేవారని, కానీ ఇప్పుడు ప్రజలు తమ భూములు కబ్జా అయినట్లు చెబుతున్నారన్నారు. అధికారం ఉన్నవారి వైపు పోలీసులు ఉన్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మంచి చేయాల్సిన మంత్రి అజయ్ కుమార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనది చిన్నతనం నుంచి పోరాడేతత్వమని, ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా తాను పోరాడానన్నారు.