
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యవివాదాన్ని రాజేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించడం, సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా వదిలివెళ్లమని ఆదేశించడంతో భారత్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ కూడా సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు 41 మంది కెనడియన్ దౌత్యవేత్తలను అక్టోబర్ 10 లోపు ఇండియా వదిలివెళ్లాలని, లేకపోతే దౌత్యపరంగా వారికున్న రక్షణను రద్దు చేస్తామని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాజాగా కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి ఉపసంహరించుకుంది. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలి మాట్లాడుతూ.. దౌత్యవేత్తలు వెళ్లిపోకపోతే భారత్ ఏకపక్షంగా వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని బెదిరించిందని, ఈ చర్య అసమంజసమైంది, దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించింది అని ఆమె శుక్రవారం ఆరోపించారు.
అయితే దీనికి భారత్ ధీటుగా స్పందించింది. ఈ సమానత్వాన్ని అమలు చేయడంలో మా చర్యలు దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ లోని ఆర్టికల్ 11.1కి పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని, సమానత్వం అమలును అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయొద్దని కెనడాకు భారత విదేశాంగ శాఖ సూచించింది. మా ద్వైపాక్షిక సంబంధాల స్థితి, భారతదేశంలో దౌత్యవేత్తలు ఎక్కువగా ఉండటం, మా అంతర్గత వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకోవడంతో భారత్, కెనడాతో పరస్పద దౌత్యపరమైన సమానత్వాన్ని కోరుతున్నామని అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.